అమరావతి విజయం .. 5 కోట్ల ఆంధ్రులది : చంద్రబాబు
అమరావతి విజయం 5 కోట్ల ఆంధ్రుల విజయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, మహిళలను అభినందించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 99 శాతం ఏకగ్రీవంగా ల్యాండ్ ఫూలింగ్ కింద భూమిని ఇచ్చిన ప్రాంతం అమరావతి అన్నారు. కేసులు, వివాదాలు లేకుండా రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, సింగపూర్ నుంచి మంత్రులు భూమి పూజకు విచ్చేశారు. అమరావతి ప్రాంతం ముంపునకు గురవుతుందని దుష్ప్రచారం చేశారు. భారీ వరదల్లోనూ ఒక్క ప్రాంతం కూడా ముంపునకు గురి కాలేదన్నారు. ఎంతో పకడ్బందీగా ముందు చూపుతో సీఆర్డీఏ చట్టాని తీసుకొచ్చామన్నారు.
అమరావతిని అడ్డుకున్న వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏం చేయగలుగుతారు? మీ రాజధాని ఏదని అడిగితే మన పిల్లలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారు. ప్రజా రాజధానిని కాపాడుకున్నది అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలే అన్నారు. అమరావతిలో అతి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని ప్రారంభిస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని కూడా నిలిపివేసిందన్నారు. అమరావతి చుట్టూ 187 కి.మీ. రింగ్‌రోడ్డుకు రూపకల్పన చేశా. రింగ్‌రోడ్డు లోపల ప్రపంచ స్థాయిలో 9 నగరాలు నిర్మించాలని భావించా. కొవిడ్ సమయంలో ఏపీ ప్రజలు ఆసుపత్రుల కోసం హైదరాబాద్‌కు వెళ్తే అడ్డుకున్నారు. అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజధాని భూములు కుదవపెట్టి రుణాలు తెచ్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు.













