ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి : సీఎం చంద్రబాబు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. గతంలో జరిగిన ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













