బాలకృష్ణ సంచలన ప్రకటన… హిందూపురం కోసం
హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయడానికైనా సిద్ధమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎంతో చరిత్ర కలిగిన హిందూపురాన్ని విస్మరించి ఇటీవలే నగర పంచాయతీగా ఏర్పడ్డ పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఎన్టీఆర్పై పట్ల వైసీపీ ప్రభుత్వం ఉత్పుత్తి ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గొప్ప పనిచేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ పట్ల నిజమైన ప్రేమ, అభిమానం ఉంటే అన్నా క్యాంటీన్లను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ నియంతృత్వ ధోరణి వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనకబడుతోందని విమర్శించారు.













