సుజనా చౌదరి మళ్లీ టీడీపీలో చేరనున్నారా..?
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. రాజకీయ నేతలందరూ సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. పొలిటికల్ ఈక్వేషన్స్ బేరీజు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారి అక్కడ పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నారు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పలువురు నేతలు వైసీపీ, బీజేపీల్లో చేరిపోయారు. వైసీపీలో తాము సెట్ కాము అనుకున్న నేతలు చాలా మంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో అక్కడ పాగా వేశారు. అయితే ఇప్పుడు అలాంటి నేతలు చాలా మంది మళ్లీ సొంతగూటికి చేరబోతున్నారనే వార్త బలంగా వినిపిస్తోంది.
టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి బీజేపీ నేత సుజనా చౌదరి వెళ్లి చాలా సేపు గడిపారు. ఈ సమావేశంలో ఇటీవలే బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణ, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు కూడా పాల్గొనడం మరో విశేషం. బీజేపీ నేత టీడీపీ నేతలతో భేటీ అయి చర్చించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సుజనా చౌదరి బీజేపీలో చేరేటప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగిసింది. ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపిస్తారని ఆయన ఆశించారు. అయితే ఆయన్ను బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆయన రాజకీయ పునరావాసం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.
సుజనా చౌదరి టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ టూ సుజనా చౌదరే అన్నట్టు సాగేది అప్పట్లో. అయితే 2019లో పార్టీ ఓడిపోగానే టీడీపీ నుంచి సుజనా చౌదరి బీజేపీలోకి జంప్ అయిపోయారు. ఆయనతో పాటు మరో ఎంపీ టీజీ వెంకటేశ్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.. లాంటి ఎంతో మంది నేతలు కమలం కండువా కప్పుకున్నారు. అయితే చంద్రబాబే వీళ్లను బీజేపీలోకి పంపించారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దక్కుతుందనే నమ్మకం లేదు.
అందుకే నాడు బీజేపీలో చేరిన నేతలంతా మళ్లీ పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నారు. సుజనా చౌదరి సహా పలువురు నేతలు టీడీపీలో చేరడం ఖాయమని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఎంతకాలం ఉన్నా తమకు ప్రయోజనం ఉండదనేది ఒక రీజన్ అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే నమ్మకం మరో కారణం.. వారిని బీజేపీని వీడేందుకు పురిగొల్పుతోందని తెలుస్తోంది. త్వరలోనే పలువురు బీజేపీ నేతలు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.













