పవన్ కల్యాణ్‌పై పోటీకి ముద్రగడ సై..!
ఉభయ గోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఈ జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాల్లో తనకు మంచి పట్టు ఉందని భావిస్తున్నారాయన. తనకు పట్టున్న స్థానాలపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా అక్కడ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించాలనుకుంటున్నారు. గతంతో పోల్చితే ఈసారి జనసేనకు బలం పెరిగిందని భావిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈసారి జనసేన ఎక్కువ సీట్లు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. ఈసారి పవన్ కు ఆ సీట్లు వెళితే తమకు నష్టం జరుగుతుందని భావిస్తున్న వైసీపీ.. పవన్ కు చెక్ పెట్టేందుకు ముద్రగడను రంగంలోకి దింపుతోంది. పవన్ కల్యాణ్ పై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు ముద్రగడ.
గత నాలుగు రోజులుగా పవన్ కల్యాణ్ వర్సెస్ ముద్రగడ అన్నట్టు సాగుతోంది రాజకీయం. కాకినాడ పర్యటనలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ముద్రగడకు నచ్చలేదు. వెంటనే ఆయన పవన్ కల్యాణ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. వీధి రౌడీ లాగా మాట్లాడావంటూ ఎద్దేవా చేశారు. ద్వారంపూడి కుటుంబం చాలా గొప్పదని, అలాంటి కుటుంబంపై అవాస్తవాలు ఎలా మాట్లాడతావ్ అని ప్రశ్నించారు. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ముద్రగడపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. కాపు జాతి కోసమే పుట్టానని చెప్పుకుంటున్న నువ్ వైసీపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నావ్ అని మండి పడుతున్నారు. ముసుగు తొలగించినందుకు థ్యాంక్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ కు ఉక్కిరి బిక్కిరి అవుతున్న ముద్రగడ ఇవాళ మరో లేఖ సంధించారు. పవన్ కల్యాణ్ బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని, అయితే ఇలాంటి బెదిరింపుల ద్వారా తనను మళ్లీ పోటీ చేసేలా ప్రేరేపిస్తున్నారని వివరించారు. పవన్ కల్యాణ్ కాకినాడ లేదా పిఠాపురం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తే.. తాను ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎన్నికల రణక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. మీ మాటలకు పడేందుకు తాను మీ బానిసను కాదని చెప్పారు.
పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టేందుకు ముద్రగడను వైసీపీ వాడుకుంటోందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ పై ముద్రగడను బరిలోకి దింపితే ఆయనకు చెక్ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారని.. అయితే అలా జరగబోదని.. చిత్తుచిత్తుగా ఓడిస్తామని సవాల్ విసురుతున్నారు. పవన్ కల్యాణ్ పై ముద్రగడ పోటి చేయాలని కోరుతున్నారు. 2009లో పిఠాపురంలో ముద్రగడ పోటీ చేసి మూడో స్థానం దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి కనీసం డిపాజిట్ కూడా దక్కదని చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













