పాపం ముద్రగడ..! ఏ జాతి బిడ్డవంటూ ఎదురు ప్రశ్నలు..!!
ముద్రగడ పద్మనాభం ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాపు జాతికోసం పుట్టిన జాతి రత్నాన్ని ఆయనకు ఆయనే చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ వాళ్లకోసం లేఖలు రాస్తూ తాను ఉన్నానని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ముద్రగడ కూడా మారిపోతుంటారు. ప్రభుత్వాలను బట్టి ఆయన వ్యవహార శైలి మారిపోతూ ఉంటుంది. సరే.. ఇప్పుడు ఆ విషాలను పక్కన పెడదాం. తాజాగా పవన్ కల్యాణ్ కు ఆయనొక బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ రాసిన లేఖపై జనసైనికులు ఓ రేంజ్ లో రిప్లైలు ఇస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్నారు. అన్నవరంలో ప్రారంభమైన ఈ యాత్ర రెండు జిల్లాల్లోని మొత్తం 11 నియోజకవర్గాల్లో సాగనుంది. అందులో భాగంగా కాకినాడలో యాత్ర చేపట్టిన పవన్ కల్యాణ్.. అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించారు. ద్వారంపూడి తన ఆడబిడ్డలపై చేయి చేసుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆయనకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. నాడు ద్వారంపూడి తాతకు డీటీ నాయక్ ట్రీట్మెంట్ ఇస్తే.. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాడని డైలాగ్స్ విసిరారు. ద్వారంపూడిని పవన్ కల్యాణ్ టార్గెట్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా ద్వారంపూడిపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ముద్రగడ సహించలేక పోయారు. వెంటనే పవన్ కల్యాణ్ కు ఘాటుగా లేఖ రాశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు ఎంతో కాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆయన కుటుంబం అలాంటిది కాదని లేఖలో ప్రస్తావించారు. ఆయనపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వీధి రౌడీ చేసినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యాఖ్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే కాకినాడలో ద్వారంపూడి పైన పోటీ చేసి గెలవాలని పవన్ కల్యాణ్ కు సవాల్ చేశారు ముద్రగడ. సహజంగా కాపు జాతి, కాపుల సంక్షేమం లాంటి అంశాలపై మాత్రమే స్పందించే ముద్రగడ.. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోసం ఒక కాపు నాయకుడికి ఇలా లేఖ రాయడం సంచలనం కలిగించింది.
ముద్రగడ పద్మనాభం లేఖ జనసైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇన్నాళ్లకు ముద్రగడ ముసుగు తీసేశాడని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. నువ్వు కాపు నాయకుడివా.. రెడ్డి నాయకుడివా… అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పార్టీలలో పవన్ కల్యాణ్ ఒక్కడే కాపు జాతికి ప్రతినిధిగా ఉన్నారు. ముద్రగడ నిజంగా కాపు జాతికోసం పాటుపడే వ్యక్తి అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు వెనకేసుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ వైసీపీ కోసం పని చేస్తున్నారనే విషయం చాలా కాలం నుంచి వినిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తుని రైలు దుర్ఘటన వెనుక కాపు నేత హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ముసుగు తీసేసి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని జనసైనికులు మండి పడుతున్నారు.













