కేఏ పాల్ పార్టీలోకి జేడీ లక్ష్మీనారాయణ? మిగిలింది అదేనా?
కేఏ పాల్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ప్రజాశాంతి పార్టీ పెట్టక ముందు ఆయన ప్రపంచాన్ని ఏలిన క్రైస్తవ మత ప్రవక్త. ఆయన కోసం ఎంతోమంది ఎదురు చూసేవాళ్ళు. తమ దేశాలకు రావాలంటూ ఆహ్వానాలు పలికే వాళ్ళు. కానీ కేఏ పాల్ ఇప్పుడు సాధారణ వ్యక్తి మాత్రమే. అంతకుమించి అందరూ ఆయనను ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి అంత చిక్కదు. తెలుగు రాష్ట్రాలకు తానే దిక్కు అన్నట్లు మాట్లాడుతుంటారు. ఇప్పటివరకు పోటీ చేసిన ఏ స్థానంలో కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయి.
అయితే కేఏ పాల్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్న తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు. ఆంధ్ర, తెలంగాణ అనే వేదం లేకుండా సమస్యలను ఎత్తిచూపుతుంటారు. పాలకులపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేకుండా అన్ని పార్టీలను ఉతికి ఆరేస్తుంటారు. నిజంగానే కేఏ పాల్ సీరియస్ పొలిటిషియన్ లాగా కనిపిస్తుంటారు. సమస్యలను ప్రజలకు చేరవేయడంలో ఆయన చాలా ముందుంటారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్ లో ఉంటారు.
మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ తన ఉనికి కోసం పోరాడుతున్నారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు ఆయన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి జనసేన పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీతో దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా విశాఖ పార్లమెంటు నుంచే పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకోసం స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకొని పోరాడుతున్నారు. బిడ్ లో కూడా పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే ఆయనకు సరైన వేదిక దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ తో కలిసి కే ఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టి సంచలనం సృష్టించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జెడి లక్ష్మీనారాయణ పోరాటం అభినందనీయమని పాల్ ప్రకటించారు. వైసీపీ టీడీపీకి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. కే ఏ పాలతో జెడి లక్ష్మీనారాయణ కలవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రజాశాంతి పార్టీ తరఫున జెడి లక్ష్మీనారాయణ పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఏదైనా ప్రధాన పార్టీ నుంచి పోటీ చేయాలని జెడి లక్ష్మీనారాయణకు ఉంది. అయితే అన్ని పార్టీల తరఫున విశాఖ పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఇప్పటికే అభ్యర్థులు సిద్ధమైపోయారు. ఏ పార్టీలోనూ కాళీ లేదు. ఒక ప్రజాశాంతి పార్టీ మాత్రమే అభ్యర్థుల వేటలో ఉంది. కాబట్టి ప్రజాశాంతి పార్టీ తరఫున జెడి పోటీ చేస్తారేమో అని భావిస్తున్నారు.













