15 మంది సిట్టింగులకు టికెట్లు డౌటే..! క్లారిటీ ఇచ్చేసిన జగన్..!?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలూ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపాయాయి. వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ వివిధ రూపాల్లో జనంలోకి వెళ్తున్నాయి. వైసీపీ మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేదానిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. ఆయా అంశాలను పార్టీ నేతలతో పంచుకుంటున్నారు. తాజాగా ఇవాళ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంటింటికీ ప్రజాప్రతినిధులందరూ వెళ్ళాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అప్పుడే జనాల్లో నేతల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందని.. ఎన్నికల సమయంలో వెళ్లి ఓట్లు అడిగేందుకు దోహదపడుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఆధారంగానే ప్రజాప్రతినిధులకు ర్యాంకులు కేటాయిస్తున్నారు. పదే పదే హెచ్చరిస్తున్నా ఇప్పటికీ పలువురు నేతల తీరులో మార్పు రావట్లేదు. దీంతో జగన్ కొన్ని సందర్భాల్లో సీరియస్ అవుతున్నారు.
ఇవాల్టి సమీక్షలో కూడా ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ఇప్పటికీ కొంతమంది నేతల తీరు మారట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారాయన. ఇలాంటి నేతల వల్ల వాళ్లకే కాకుండా పార్టీకి కూడా నష్టం జరుగుతుందని.. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చే చెప్పేశారు. ఇలాంటి వాళ్లు టికెట్లు అడగొద్దని స్పష్టం చేశారు. పనితీరు బాగలేని నేతలకు వ్యక్తిగతంగా ఆ సమాచారాన్ని పంపిస్తామని చెప్పారు. గతంలో అక్కడికక్కడే జగన్ పేర్లు చదివి హెచ్చరించేవారు. కానీ ఈసారి మాత్రం నేతల పేర్లు చదవలేదు.. ఎవరి పనితీరు బాగాలేదో చెప్పలేదు. సమాచారాన్ని వ్యక్తిగతంగా పంపిస్తామని మాత్రమే చెప్పి వదిలేశారు. దీంతో ఆ నేతలెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇప్పటికైనా మేల్కొనాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 175కు 175 సీట్లూ గెలిచి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జగన్ నేతలకు సీరియస్ గా క్లాసులు పీకేవారు. కానీ ఆ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తీరులో మార్పు కనిపిస్తోందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గతంలో నేతలకు హెచ్చరికలు ఘాటుగా ఉండేవని.. కానీ ఇప్పుడు సూచనలకు సలహాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని చెప్తున్నారు. ఎన్నికల ముంది నేతలను దూరం చేసుకోవడం సరికాదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. దీంతో జగన్ కూడా కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నారు.













