నెల్లూరులో వైసీపీకి మరో షాక్ తగలనుందా..?
నెల్లూరు జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఏ జిల్లాలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో అంతర్గత విభేదాలు పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ లోటును పూడ్చేందుకు అధిష్టానం ఆపసోపాలు పడుతోంది. ఇంతలో మరో ఎమ్మెల్యే అలక వహించడం సంచలనం కలిగిస్తోంది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేదనుకుంటున్న సమయంలో ఈ పరిణామం ఆ పార్టీ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిలా మారింది. వాళ్లు దారికి వచ్చే అవకాశం లేకపోవడంతో వదిలించుకున్న వైసీపీ.. ఉన్న నేతలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. అయినా పెద్ద ఉపయోగం లేదని అర్థమవుతోంది. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్టానంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్షకు కూడా అనిల్ కుమార్ యాదవ్ డుమ్మా కొట్టారు. అనిల్ ఏం చేయబోతున్నారని జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది.
ఇంతలో అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ సన్నిహితులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. మొన్న జగన్ సమీక్షకు డుమ్మా కొట్టడం, ఇవాళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా నెల్లూరు పరిధిలోని నేతలతో అనిల్ కుమార్ యాదవ్ కు పొసగట్లేదు. ముఖ్యంగా బాబాయ్ వరసయ్యే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇరు వర్గాలూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు అత్యంత ఆప్తుడిగా పేరొందిన నుడా ఛైర్మన్ ద్వారకానాథ్ కూడా దూరమయ్యారు. అంతేకాక వీళ్లిద్దరూ కలిసి ప్రత్యేక కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా చూసీచూడనట్లు వదిలేసింది. ఇది అనిల్ కుమార్ యాదవ్ అస్సలు ఊహించలేదు.
మరోవైపు నెల్లూరు సిటీ పరిధిలోని శ్రీకాంత్ రెడ్డికి జిల్లా యువజన విభాగ అద్యక్ష పదవిని కట్టబెట్టింది హైకమాండ్. ఇతని నియామకం విషయంలో అనిల్ కుమార్ యాదవ్ ను మాట మాత్రమైనా సంప్రదించలేదు. తనకు వ్యతిరేకంగా జిల్లాలో నేతలు పావులు కదుపుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కూడా అనిల్ కు విభేదాలున్నాయి. కావాలనే తనను టార్గెట్ చేశారని అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం ఆయన్ను మరింత కలచివేస్తోంది. మరి ఆత్మీయ సమ్మేళనం అనంతరం అనిల్ కుమార్ యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది.













