రాష్ట్రంలో అదనంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యానికి చర్యలు
– రాష్ట్ర గిడ్డంగులు సంస్ధ ఛైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్
రాష్ట్రంలో అదనంగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల గొదాములను నిర్మిస్తున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు శుక్రవారం విచ్చేసిన గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ పొందూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ప్రాంగణంలో గిడ్డంగుల సంస్ధ నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంగల గిడ్డంగులను ప్రభుత్వ విప్ కూన రవి కుమార్, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో గిడ్డంగులు సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల వివరాలను వివరించారు.
రాష్ట్రంలో గిడ్డంగుల సంస్ధ సొంతంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంగల గొదాములను నిర్వహిస్తుందని, వాటితోపాటు ప్రైవేటు సంస్ధల నుండి 6.50 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంగల గొదాములను అద్దె ప్రాతిపదికన తీసుకుని నిర్వహిస్తోందని చెప్పారు. ఈ గొదాములను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. నిల్వ ఉంచిన సరుకులకు పురుగు పట్టడం ఇతర విధాలుగా పాడు కావడం ఉండదని ఆయన చెప్పారు.
గిడ్డంగులలో నిల్వ ఉంచిన సరుకులకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులు తమ ధాన్యంను గిడ్డంగులలో నిల్వ ఉంచుకుని మంచి ధరలు వచ్చునపుడు విక్రయించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రసాద్ చెప్పారు. నిల్వఉంచిన ధాన్యానికి రశీదు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ రశీదులను చూపించి బ్యాంకుల నుండి రుణాలు పొందే సౌకర్యం కలుగజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెనాలి రైతులు ఈ విధానాన్ని పాటించారని ఆయన అన్నారు. అనంతపురంలో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో వేరుశనగప్రాసెసింగు యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటి వనరులు కల్పించడంతో మంచి దిగుబడులు వచ్చాయని ఆ ప్రాంతంలో గిడ్డంగులు సామర్ధ్యంపెంచాల్సిన అవసరం ఉందని ఛైర్మన్ ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రభుత్వవిప్, పార్లమెంటు సభ్యులు ప్రతిపాదనలు ఇచ్చారని ఛైర్మన్ అన్నారు. ఇటీవల జిల్లాలో బామిణి మండల కేంద్రంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో గొదాములు ఏర్పాటు చేయడం వలనఆ ప్రాంత గిరిజనులు, ఇతర రైతులు తమ సరుకులను నిల్వ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని చైర్మన్ ప్రసాద్ చెప్పారు. శ్రీకాకుళంజిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న మంచి దిగుబడులు వచ్చాయని వాటికి నిల్వసామర్ధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ, మినప, కందిపప్పు దిగుబడి బాగా పెరిగిందని వాటికి అనుగుణంగా గొదాములు అవసరం ఉందని ప్రసాద్ చెప్పారు. రైతులకు, కౌలుదారులకు రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్ల సమావేశంలోనిర్ణయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
గిడ్డంగుల సంస్ధ ఆధ్వర్యంలో ప్రాసెసింగు, కోల్డు స్టోరేజీలు ః రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ గొదాములలో డ్రై స్టాక్ నిల్వ చేయడానికే పరిమితం కాకుండా కోల్డు స్టోరేజి, ప్రాసెసింగు యూనిట్లనునెలకొల్పుటకు రంగం సిద్ధం చేసామని ఛైర్మన్ ప్రసాద్ చెప్పారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు వద్ద 27 ఎకరాల స్ధలంను స్పైసెస్ పార్కులో లీజుపై తీసుకున్నామని ఆయన అన్నారు. అచ్చటరూ.50 కోట్లతో పసుపు, మిరపకాయల ప్రాసెసింగు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
13,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల నిల్వకు అవకాశం ఉంటుందని ఆయనచెప్పారు. శంకుస్ధాపన చేయుటకు రాష్ట్ర ముఖ్య మంత్రిని కోరామని చెప్పారు. ఈ నిర్మాణాలను నవంబరు నాటికి పూర్తి చేసి డిశంబరు నాటికి అన్ని సౌకర్యాలతో రైతులకు అందుబాటులోకితెస్తామని ఆయన పేర్కొన్నారు. ఆక్వా రంగంలో సైతం ప్రవేశిస్తూ విశాఖపట్నంలో 12 ఎకరాల స్ధలంలో రూ.80 కోట్లతో ఆక్వా ప్రాసెసింగు యూనిట్ ను నెలకొల్పుటకు సన్నాహాలుచేస్తున్నామని అన్నారు. ఇందులో సంబంధిత మౌళికసదుపాయాలు పూర్తి స్ధాయిలో కల్పిస్తామని ప్రసాద్ చెప్పారు. నెల్లూరు జిల్లా మనుగోలు వద్ద 20 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల ఫిష్ప్రాసెసింగు యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు జలవనరులు శాఖ అనుమతులు జారీ చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లను సహాయం చేస్తుందని మొత్తం రూ.32కోట్లతో నిర్మిస్తామని చైర్మన్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం వెనుకకు నిధులు తీసుకోవడం సరైన చర్యకాదు ః వెనుకబడి ప్రాంతాల అభివృద్దికిగాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన రూ.350 కోట్లు రాష్ట్ర ఖాతాలో జమచేసి తిరిగి ఆ మొత్తాన్ని వెనుకకు తీసుకోవడం సరైన చర్య కాదని ఛైర్మన్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ నిధులు వెనుకకు తీసుకోవడం వలన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సైతం ఖర్చుచేయాల్సిన రూ.50 కోట్ల చొప్పున నిధులు వెనుకకు వెళ్ళిపోయిందని ఆయన అన్నారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వ విప్ కూన రవి కుమార్, పొందూరు మార్కెట్ కమిటి అధ్యక్షులు అన్నెపు రాము, గిడ్డంగుల సంస్ధ ప్రాంతీయ మేనేజర్ దవళ సత్యం తదితరులు పాల్గొన్నారు.













