ప్రజలంతా తెలుగుదేశం వైపే : చంద్రబాబు
రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజల్లో సంతృప్తి తీసుకోరావాలని, ప్రజలంతా తెలుగుదేశం వైపే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకీ రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. మనలో కసి, పట్టుదల పెంచేందుకు దీక్షలు, సంకల్పం చేస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో రిలాక్షేషన్ ఉండకూడదని పేర్కొన్నారు. హత్య చేసినవాళ్లే పూలదండలతో వస్తున్నారని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వైకాపా బలహీనపడటంతో కాంగ్రెస్ బలపడాలని చూస్తోందన్నారు. డిపాజిట్లు కూడా రాని స్థితి నుంచి సభలు నిర్వహించే స్థితికి కాంగ్రెస్ వచ్చిందన్నారు. మనం తప్పు చేస్తే ప్రత్యర్థి నెత్తిన పాలు పోసినట్లేన్నారు. రాష్ట్రాన్ని బాగుచేసే అవకాశం మనకు వచ్చిందని, మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి, జిల్లాకో సంకల్పం జరగాలని, రాష్ట్ర స్థాయిలో మహా సంకల్పం చేయాలని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువగా ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన భాద్యత కేంద్రంపైనే ఉందన్నారు.













