Amaravati: అమరావతిలో మరో కీలక నిర్మాణం – రూ.600 కోట్లతో ఏపీఎన్ఆర్టీ ఐకాన్
రాజధాని అమరావతి (Amaravati)లో మరో కీలక నిర్మాణానికి వారం రోజుల్లో ముందడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ భవనాన్ని మూడు విడతల్లో నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి దశలో సబ్ సర్ఫేస్ (పునాది), తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్టర్, అనంతరం బయటికి కనిపించే అందమైన భాగం కడతారు. ఇప్పటికే పునాదికి సంబంధించి టెండర్ల ప్రక్రియను ఏపీఎన్ఆర్టీ (APNRT )అధికారులు పూర్తి చేశారు. ఆస్ట్రేలియా-యూకే (Australia-UK)కి చెందిన కెల్లర్ సంస్థ ఈ పనుల్ని దక్కించుకుంది. వీటిని మూడు నెలల్లో పూర్తి చేయనుంది. ఆలోగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ భవనాన్ని 2028 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం.
ఏపీఎన్ఆర్టీ రూ.600 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనుంది. దీనికయ్యే వ్యయాన్ని ఎన్ఆర్ఐ (NRI )లే భరించనున్నారు. మొత్తం 36 అంతస్తులతో జంట టవర్లు నిర్మిస్తారు. పార్కింగ్ కోసం రెండంతస్తుల సెల్లారు, దానిపై పోడియం ఉంటుంది. ఆపై 33 అంతస్తులు నిర్మిస్తారు. ఒక్కో టవర్లో 29 అంతస్తులుంటాయి. ఒక టవర్లో అంతస్తుకు రెండు చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఆయా కంపెనీల ద్వారా సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. రెండు టవర్లనూ కలుపుతూ పైన నాలుగంతస్తులు నిర్మిస్తారు. వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు.













