Jagan: రైతు, రైతు భూమిపై రాజకీయ ముద్ర…చివరకు భారం మోస్తున్న కూటమి ప్రభుత్వం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని విధానాలపై పునఃసమీక్ష చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఫొటోతో ముద్రించిన భూ సంబంధిత పత్రాలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్య వల్ల ప్రభుత్వానికి భారీగా ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం (YSR Congress Party) ల్యాండ్ టైటిలింగ్ యాక్టు (Land Titling Act)ను అమలు చేస్తూ అప్పటివరకు ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేసింది. వాటి స్థానంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం పేరుతో కొత్త పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఫొటోను ముద్రించడం పెద్ద చర్చకు దారితీసింది. భూమి రైతుదైనప్పుడు, ప్రభుత్వ పత్రాలపై రాజకీయ నాయకుల ఫొటోలు ఎందుకు అన్న ప్రశ్నలు అప్పుడే వినిపించాయి. అయితే అది ప్రభుత్వ నిర్ణయం కావడంతో రైతులు మౌనంగా ఉండాల్సి వచ్చింది.
ఎన్నికల సమయంలో ఈ అంశం మరింత రాజకీయంగా మారింది. కొందరు రైతులు వైఎస్ భారతిరెడ్డి (Y.S. Bharathi Reddy)ని నేరుగా ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ,పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ భూరక్ష పుస్తకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని రద్దు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా జరిగిన సర్వేలో అనేక తప్పిదాలు ఉన్నాయని కూడా వారు విమర్శించారు.
ఇప్పుడు అదే హామీ మేరకు కూటమి ప్రభుత్వం జగనన్న భూరక్ష పుస్తకాలను వెనక్కి తీసుకుని కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయడానికి సిద్ధమైంది. ఈ కొత్త పుస్తకాలపై ఎలాంటి వ్యక్తిగత ఫొటోలు లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 21.80 లక్షల రైతులకు ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక భూ వివాదాలు బయటపడటం కూడా ఈ నిర్ణయానికి కారణమని చెబుతున్నారు. చాలా గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పెరగడం, గత సర్వే వల్ల గందరగోళం ఏర్పడటం వంటి అంశాలు రైతుల్లో అనుమానాలను పెంచాయి. గత 18 నెలలుగా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇంకా కొన్ని చోట్ల సమస్యలు పూర్తిగా తీరకపోయినా, రైతుల్లో నమ్మకం పెంచేందుకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Sathya Prasad) స్పష్టంగా వెల్లడించారు. ఈ ప్రక్రియతో భూ వివాదాలు తగ్గి, రైతులకు భద్రతాభావం కలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.






