Congress: 2000 విద్యుత్ ఉద్యమం..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మలుపు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొన్ని సంఘటనలు మలుపు తిప్పాయి. అందులో 2000లో జరిగిన విద్యుత్ ఉద్యమం ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆ పోరాటం అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద మాత్రమే కాకుండా, తర్వాతి దశాబ్దాల రాజకీయాలపై కూడా గాఢమైన ప్రభావం చూపింది.
1994లో ఎన్టీఆర్ (N.T.R) నేతృత్వంలో టీడీపీ (TDP ) వామపక్షాలు ఘనవిజయం సాధించాయి. కాంగ్రెస్ (Congress) కేవలం 26 సీట్లకు పరిమితమైంది. కానీ 1995లో పార్టీ లోపల విభేదాలు తలెత్తడంతో ఆర్థిక మంత్రి నారా చంద్రబాబు నాయుడు (N.Chandrababu Naidu) అధికారం చేపట్టారు. ఆయన శాసనంలో ప్రజల దగ్గరకి వెళ్లే విధానాలు, ఆకస్మిక తనిఖీలు, “జన్మభూమి” వంటి కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకొని మళ్లీ ఘనవిజయం సాధించారు.
అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం ప్రజల్లో అసంతృప్తిని రేపింది. 2000లో వర్షాభావం, కరువు పరిస్థితులు ఉండగానే 20 శాతం పెంపు నిర్ణయం తీసుకోవడంతో వామపక్షాలు ముందుగా ఆందోళనలు ప్రారంభించాయి. బిజిలీ బంద్‌లు (Bijli Bund) , ర్యాలీలు, నిరసనలు కొనసాగాయి. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ కూడా జత కావడంతో ప్రభావం మరింత పెరిగింది. అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి (Y.S.Rajasekhara Reddy) నిరాహార దీక్ష చేపట్టారు. రెండు నెలల పాటు ఈ పోరాటం కొనసాగింది.
ఆగస్టు 28, 2000న జరిగిన “చలో అసెంబ్లీ” (Chalo Assembly) కార్యక్రమం సందర్భంగా హైదరాబాదు (Hyderabad) బషీర్ బాగ్ (Basheerbagh) వద్ద పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. ఈ సంఘటన ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇదే వైఎస్‌కు ప్రజల్లో పోరాట నాయకుడిగా పేరు తెచ్చింది. అంతకుముందు టీడీపీలో ఉన్న కే.చంద్రశేఖరరావు (K.Chandrasekhar Rao) కూడా ఈ పెంపుపై తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన తెలంగాణ (Telangana) రైతులు ఎక్కువగా బోరుబావులపై ఆధారపడి ఉంటారని, పెరిగిన చార్జీల భారం వారిపైనే పడుతుందని వాదించారు. తన పదవులను రాజీనామా చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ను ప్రారంభించారు. ఇది తర్వాత తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది.
తరువాతి ఎన్నికల్లో ఈ విద్యుత్ ఉద్యమం ప్రధాన మలుపు అయ్యింది. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల కూటమి ఘన విజయం సాధించగా వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2009 వరకు ఆయన పాలన కొనసాగింది. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ (Y.S.Jagan) కొత్త పార్టీని ప్రారంభించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అంటే, 2000లో ప్రారంభమైన విద్యుత్ ఉద్యమం ఒక ప్రభుత్వంపై అసంతృప్తిని మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను శాశ్వతంగా మార్చేసింది. ఆ రోజు జరిగిన బషీర్ బాగ్ కాల్పులు చరిత్రలో చెరగని ముద్ర వేశాయి.