ప్రాణాయామంతో ఒత్తిడి మటుమాయం!
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అంతా ఉరుకులు పరుగుల జీవితమే. దీంతో చాలామందిలో ఒత్తిడి కొండలా పెరిగిపోతూ, అనారోగ్యానికి దారి తీస్తోంది. అయితే, ఈ ఒత్తిడిని చిత్తు చేసేందుకు అత్యంత సులభమైన మార్గం ఉందని సూచిస్తున్నారు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అదే ప్రాణాయామం. యోగాలో భాగంగా ఏళ్లుగా ప్రాచుర్యం పొందిన ప్రాణాయామంలోని లోతైన, దీర్ఘ శ్వాసలు ఒత్తిడిని మటుమాయం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నవ్వుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, నిద్రించే సమయంలో ఇలా ఒక్కోసారి శ్వాసవిధానాలు ఒక్కోలా ఉంటాయి. అయితే, మెదడులోని కొన్ని నాడీకణాలు ఈ శ్వాసవిధానాలను నియంత్రిస్తూ, మానసిక స్థితిలో అనుసంధానం చేస్తున్నట్లు తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఏయే నాడీకణాలు ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నాయో సృష్టంగా తెలుసుకున్నారు. అనంతరం ఎలుకలపై పరిశోధనలు చేపట్టి, వేగంగా శ్వాసించడానికి సహకరించే నాడీ కణాలను తొలగించారు. దీంతో అవి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా ఉండటాన్ని గుర్తించారు. ప్రాణాయామంలోని దీర్ఘశ్వాసలు ఒత్తిడిని తగ్గిసాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని వివరించారు.













