అమెరికా పర్యటనకు అరుణ్ జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ వారంలో అమెరికా, రష్యాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్లో జరిగే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సమావేశాల్లో ఆయన మొదట పాల్గొంటారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 21-23 తేదీల్లో జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బ్యాంకుల సారథులు, ఆర్థిక శాఖ మంత్రులు, ప్రైవేటు రంగ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, అకాడమిక్స్ పాల్గొంటారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఔట్లుక్, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన, ఉపాది కల్పన, వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉంటున్నప్పటి నుంచి ఈ సమావేశాలకు తప్పకుండా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రితో పాటు ఇతర దేశాల ఆర్థిక మంత్రులతోనూ ఆయన కలిసి వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. తర్వాత రష్యాకు పయనమవుతారు. అక్కడ రష్యాతో మిలిటరీ సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఆయన మంతనాలు జరపనున్నారు. ఏప్రిల్ 25 నుంచి రెండు రోజుల పాటు మాస్కోలో జైట్లీ పర్యటిస్తారు. ఏప్రిల్ 27న జైట్లీ తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంటారు.













