Raihan Vadra : గాంధీ-వాద్రా కుటుంబంలో పెళ్లి బాజాలు
గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి సందడి మొదలుకాబోతోంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన యువ ఫోటోగ్రాఫర్ అవీవా బేగ్ (Aviva Baig)తో రేహాన్ ఏడడుగులు వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు కుటుంభాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను రాజస్థాన్ లోని రణథంభోర్ లో జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ.. రేహాన్, అవీవా ఇద్దరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన, సృజనాత్మకమైన ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. వీరిద్దరినీ కలిపింది కళ, ఫోటోగ్రఫీ కలిపాయని చెప్పొచ్చు. వీళ్లకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. రేహాన్ వాద్రా వయసు ప్రస్తుతం 25 ఏళ్లు. సంప్రదాయ గాంధీ కుటుంబ వారసుడిలా కాకుండా ఒక విజువల్ ఆర్టిస్ట్ (Visual Artist)గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. డెహ్రడూన్ లోని ప్రఖ్యాత డూన్ స్కూల్ (Doon School)లో చదివిన రేహాన్, లండన్ లోని SOAS యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. రేహాన్ కు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఢిల్లీలోని బికనీర్ హౌస్ లో డార్క్ పర్సెప్షన్ (Dark Perception), అనుమాన్ వంటి పేర్లతో తన ఫోటోగ్రఫీ, ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించాడు. రాజకీయాలకు దూరంగా ఉంటూ, తన కెమెరా కన్నుతో ప్రపంచాన్ని చూడటానికే ఇష్టపడతాడు.
ఇక అవీవా బేగ్ ఢిల్లీకి చెందిన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఢిల్లీలోని మోడరన్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె, ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం, మీడియా కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పొందింది. ప్రస్తుతం అటెలియర్ 11 (Atelier 11) అనే ఫోటోగ్రఫీ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి సహ-వ్యవస్థాపకురాలిగా (Co-founder) వ్యవహరిస్తోంది. కేవలం కళాకారిణిగానే కాకుండా, అవీవా ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణి కూడా కావడం విశేషం.
ఈ పెళ్లి కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహబంధానికి దొరికిన కొత్త అర్థం. అవీవా తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త కాగా, తల్లి నందితా బేగ్ ఒక ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ప్రియాంకా గాంధీ, అవీవా తల్లి నందితా బేగ్ మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్ పనుల్లో నందితా బేగ్, ప్రియాంకా గాంధీతో కలిసి పనిచేశారు. ఈ వృత్తిపరమైన సాన్నిహిత్యమే కుటుంబాలను దగ్గర చేసింది.
ఈ వివాహం గురించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇది పూర్తిగా నాన్-పొలిటికల్ (Non-political) వాతావరణంలో జరుగుతున్న వేడుక. రేహాన్, అవీవాలు ఇద్దరూ ఒకే స్కూల్ లో కొంతకాలం చదువుకోవడం, ఇద్దరికీ ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్, ఆర్ట్ మీద ఆసక్తి ఉండటం వారిని దగ్గర చేసింది. సాధారణంగా రాజకీయ నాయకుల ఇళ్లలో పెళ్లిళ్లు ఆర్భాటంగా జరుగుతాయి. కానీ, ఈ జంట తమ నిశ్చితార్థాన్ని అత్యంత గోప్యంగా జరుపుకోవడం వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
మొత్తానికి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న గాంధీ కుటుంబం, ఈసారి రాజకీయ పొత్తులతో సంబంధం లేకుండా, కళాత్మక విలువలున్న ఒక సాధారణ కుటుంబంతో వియ్యం అందుకోబోతుండటం విశేషం. రేహాన్-అవీవాల జంట వారి తల్లిదండ్రుల స్నేహాన్ని బంధుత్వంగా మార్చుతూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.






