Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఇంట పెళ్లిసందడి.. కుమారుడు రేహాన్ ఎంగేజ్ మెంట్..!
గాంధీ కుటుంబంలో దశాబ్దాల తర్వాత బాజాభజంత్రీలు మోగనున్నాయి. అగ్రనాయకురాలు , ఎంపీ ప్రియాంకగాంధీ, రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా .. తన నెచ్చెలితో ఏడడుగులు వేయనున్నాడు.
తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వీరిద్దరూ దిగిన ఫొటోను అవీవా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. తర్వాత అదే ఫొటోను ‘హైలైట్స్’ సెక్షన్లో ఉంచారు. దీంతో వీరి ఎంగేజ్మెంట్ వార్తలకు ఇది మరింత బలం చేకూర్చినట్లయ్యింది.
రేహాన్-అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇటీవల అవీవా ముందు రేహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. దానికి ఆమె ఆమోదించినట్లు సమాచారం. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం జరిపించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై గాంధీ, వాద్రా కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అవీవా కుటుంబసభ్యులు ఢిల్లీకి చెందినవారని, వాద్రా కుటుంబంతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం.
రేహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్. వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో ఢిల్లీలోని బికనేర్ హౌస్‌లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తన తొలి ఎగ్జిబిషన్ నిర్వహించారు. అవీవా కూడా ఫొటోగ్రాఫర్. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశారు. ఓ ఫొటోగ్రఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు.






