బీజేపీకి పవన్ కటీఫ్ చెప్తారా?
తెలంగాణ బీజేపీ తమను అవమానించిందని.. అందుకే పీవీ కుమార్తె వాణిదేవికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పిన రోజే.. ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన ఎక్కువ స్థానాలు సాధించడం.. ఓట్ల శాతం కూడా అధికంగా ఉండడంతో జనసేన అంతర్మథనంలో పడింది. దీంతో రెండు పార్టీల మధ్య ఇక కటీఫ్ ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
తెలంగాణ బీజేపీపై పవన్ కల్యాణ్ సమరశంఖం పూరించారు. తాము 40స్థానాల్లో పోటీ చేసి కూడా బీజేపీకి మద్దతిస్తే వాళ్లు మమ్మల్ని చులకన చేసి మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కలకలం రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న సమయంలోనే ఏపీలో మున్సిపల్ ఫలితాలు రావడం ప్రారంభించాయి. చివరకు చూస్తే బీజేపీ కంటే జనసేన ఎంతో బెటర్ అనే స్థాయిలో నిలబడింది. దీంతో జనసైనికులు బీజేపీపై విమర్శలు మొదలుపెట్టారు.
కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వల్లో జనసేన అభ్యర్థులు ఓటమిపాలయ్యారని ఆ పార్టీ నేతలు నేరుగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేత పోతిన మహేశ్.. విజయవాడలో జనసేన ఓటమికి బీజేపీయే కారణమని స్పష్టం చేశారు. బీజేపీతో కలసి పోటీ చేసినా ఆ పార్టీ నేతలు సహకరించలేదన్నారు. పైగా తమకు ఎస్సీ, ఎస్టీ ఓటర్లు, మైనారిటీలు దూరమయ్యారని పోతిన మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. బీజేపీతో పొత్తు వద్దని జనసైనికులు చెప్తున్నారంటూ బాంబు పేల్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు.
ఓవైపు అధినేతే తెలంగాణ బీజేపీపై కామెంట్స్ చేయడం.. మరోవైపు ఏపీలో జనసైనికుల నుంచి పొత్తుపై అసంతృప్తులు పెరుగుతుండడంతో రెండు పార్టీల మధ్య పొత్తు కంటిన్యూ అవుతుందా అనే సందేహం మొదలైంది. పైగా బీజేపీ కంటే ఓటింగ్లో అయినా, సీట్లలో అయినా తామే బెటర్ అనే ఫీలింగ్ జనసైనికుల్లో కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలో త్యాగం చేసినా పెద్దగా పట్టించుకోలేదని.. ఇప్పుడు తిరుపతి సీటును కూడా త్యాగం చేశామని.. ఇలా త్యాగాలు చేసుకుంటూ పోతే నష్టమనే భావన పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. మరి జనసైనికుల డిమాండ్ ను పవన్ కల్యాణ్ అంగీకరిస్తారా.. లేదంటే పొత్తు కంటిన్యూ చేస్తారా.. అనేది తేలాల్సి ఉంది.













