ఎవరీ కవితా సర్కార్..? దేశజనులందరిలోనూ ఆసక్తి…!
బెంగాల్ లో మెడికో హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. వెల్లువెత్తిన ప్రజా నిరసనలకు తలొగ్గిన మమత సర్కార్…. దీన్ని సీబీఐకి అప్పగించింది. మరోవైపు ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు.. బెంగాల్ సర్కార్ తో పాటు పోలీసులకు తలంటింది. దీంతో ఈ కేసు విచారణ వేగవంతమైంది. నిందితులతో పాటు బాధ్యులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు కూడా. అయితే ఈ కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి మానవమృగం తరపున వాదించడమా అన్న సందేహంలో పడిపోయారు లాయర్లు.చివరకు ఓ మహిళా లాయర్ ముందుకు వచ్చి.. తాను సంజయ్ రాయ్ కేసు వాదిస్తానంటూ వార్తల్లోకి ఎక్కారు. ఆమెనే కవితా సర్కార్.
ఎంత తీవ్రమైన కేసు అయినా.. నిందితుడి తరఫున వాదనలు వినిపించేందుకు ఒక లాయర్ తప్పనిసరిగా ఉండాలి. ముంబైలో పేలుళ్లు,కాల్పులకు తెగబడి మన దేశంలో మారణ హోమం సృష్టించిన పాక్ ఉగ్రవాది కసబ్‌కు సైతం కోర్టు లాయర్‌ను నియమించింది. ఇది న్యాయవ్యవస్థ నిబంధనల్లో ఒకటి. కేసు ఎంత తీవ్రమైంది అయినా.. విచారణలో పారదర్శకత కోసం నిందితుడి తరఫున కూడా వాదనలు వినడం ముఖ్యమే. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు..నిందితుడికి లీగల్ ఎయిడ్‌కు ఇటీవల సిఫార్సులు చేసింది. దీంతో సంజయ్ రాయ్ కోసం వాదించే బాధ్యతలను కోల్‌కతాకు చెందిన మహిళా లాయర్ కవితా సర్కార్‌కు అప్పగించారు. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.
52 ఏళ్ల కవితా సర్కార్.. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్లో సభ్యురాలిగా ఉన్నారు. కేసు విచారణ కోసం లాయర్ ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నవారి కోసం..లేదా వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రాని కేసుల్లో నిందితులు, బాధితులకు ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయపరంగా సహాయం అందిస్తుంది. అలా ఈ కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు నిందితుడు అయిన సంజయ్ రాయ్ కేసు కవితా సర్కార్ చేతికి వచ్చింది. గతంలోనూ చాలా మందికి తన జీతం నుంచే బెయిల్ బాండ్లను సమర్పించినట్లు కవితా సర్కార్ వెల్లడించారు. ఈ కేసులో నిందితుడి తరఫున ఇటీవల ఆమె సెల్దా కోర్టులో వాదనలు వినిపించి.. సంజయ్ రాయ్‌కి పాలీగ్రాఫ్ టెస్ట్ గురించి వివరించారు.
హూగ్లీ మోహ్సిన్ కాలేజీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసిన కవితా సర్కార్.. అలిపోర్ కోర్టులో తన కెరీర్‌ను మొదలు పెట్టారు. గతేడాది జూన్‌లోనే ఆమె సెల్దా కోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు.లాయర్ వృత్తిలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న కవితా సర్కార్.. మొదట్లో ఎక్కువగా సివిల్ కేసులు వాదించేవారు. గతేడాది ఫిబ్రవరిలో క్రిమినల్ లాయర్‌గా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఆమె చేరారు.













