డీఎంకేలోకి పన్నీర్ సెల్వం..!
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, AIADMK మాజీ సమన్వయకర్త పన్నీర్ సెల్వం(Panneerselvam) అధికార పక్షమైన DMKలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన అధికారికంగా డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.
దివంగత జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పన్నీర్ సెల్వం పేరొందారు. ఆమె స్థానంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఓపీఎస్, ఇప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం గూటికి చేరడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. AIADMKలో ఎడప్పాడి పళనిస్వామి తో సాగిన సుదీర్ఘ అధికార పోరాటం, ఊరటనివ్వని కోర్టు తీర్పుల తర్వాత ఒంటరైన ఓపీఎస్, చివరకు తన రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పక్షంతో చేతులు కలిపారు. ఆయనతో పాటు ఉసిలంపట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్ కూడా డీఎంకేలో చేరారు.
ఇవి కూడా చదవండి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్ తన సొంత నియోజకవర్గమైన తేనిలోని బోడి మెట్టు నుంచి డీఎంకే తరఫు పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెల్వం చేరిక డీఎంకే (DMK)కు ఉపయోగపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరిణామం తమిళనాడులోని పాత , కొత్త రాజకీయ సమీకరణాలను తలకిందులు చేయనుంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో బలమైన పట్టున్న ఓపీఎస్ రాకతో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మరింత పటిష్టమవడమే కాకుండా, అన్నాడీఎంకేకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. జయలలిత వారసుడిగా చెప్పుకునే వ్యక్తి ప్రత్యర్థి పార్టీలో చేరడం వల్ల ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి








