విశ్వకవి రవీంద్రుడికి, గుజరాత్‌కు ఉన్న అనుబంధమిదే…
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు బెంగాల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విశ్వభారతి విశ్వ విద్యాలయం శత వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. తన స్వరాష్ట్రం గుజరాత్‌తో విశ్వకవి ఠాగూర్‌కు అనుబంధం ఉందని ప్రధాని గుర్తు చేశారు. ఠాగూర్ పెద్దన్నయ్యకు వృత్తిరీత్యా గుజరాత్లో పోస్టింగ్ వచ్చిందని, ఈ కారణంగానే ఠాగూర్ చాలాసార్లూ గుజరాత్‌కు వెళ్లేవారని తెలిపారు. అంతేకాకుండా గుజరాతీలో ఠాగూర్ రెండు పద్యాలు కూడా రాశారని ఆయన గుర్తు చేశారు. భిన్న భిన్న సంస్కృతులకు ఆలవాలమైన భారతం గొప్పదనాన్ని, ఆవశ్యకతను తెలిపేందుకే ఈ సంఘటనను నెమరువేసుకున్నట్లు ప్రధాని వివరించారు. అంతేకాకుండా ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ కు ఇదే అతిపెద్ద నిదర్శనమని కొనియాడారు. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మోదీ వెల్లడించారు.
ఠాగూర్ వదినే ఆధునిక చీర కట్టుకు ఆద్యురాలని ఆయన వెల్లడించారు. రవీంద్రుడి మార్గదర్శనంలోనే విశ్వభారతి యూనివర్శిటీ రూపుదిద్దుకుందని, ఆనాడే ఆత్మనిర్భర భారత్‌కు బీజం పడిందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో గురుదేవులు రవీంద్రుడి మార్గదర్శకత్వంలో భారత జాతీయవాద దృక్పథానికి విశ్వభారతి యూనివర్శిటీ ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. భారతదేశపు ఆధ్యాత్మిక జాగృతి నుంచి యావత్తు మానవాళీ లబ్ధిపొందాలని గురుదేవులు ఆకాంక్షించారని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు దారి తీసిన పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని ఆయన విద్యార్థులకు సూచించారు. దీని స్థాపనకు కేవలం బ్రిటీష్ పాలన మాత్రమే కాదని, వందల సంవత్సరాల ఉద్యమ చరిత్ర, సుసంపన్నమైన సిద్ధాంతాలు కూడా ఈ విశ్వవిద్యాలయ స్థాపనకు దారితీశాయని ఆయన వివరించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయ వందేళ్ల ప్రయాణం చాలా ప్రత్యేకమైందని కొనియాడారు. భారతమాత కోసం రవీంద్రుడి ఆలోచనలు, దూరదృష్టి, కఠోర శ్రమలకు ఈ విశ్వవిద్యాలయం నిజమైన ప్రతిరూపమని వ్యాఖ్యానించారు. భారత్‌కు ఈ యూనివర్శిటీ ఆరాధనీయమని, ఆదరణీయమని మోదీ వ్యాఖ్యానించారు.
మన దేశంలోనే ప్రాచీనమైంది ఈ విద్యాలయం
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విశ్వవిద్యాలయాన్ని 1921 లో స్థాపించారు. ఇది మన దేశంలోనే అతి పురాతనమైన సెంట్రల్ యూనివర్శిటీ. 1951 మే నెలలో పార్లమెంట్ చట్టం ద్వారా ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ప్రకటించారు. మన దేశ ప్రధానమంత్రి ఈ విశ్వవిద్యాలయానికి కులపతి (ఛాన్స్లర్) గా వ్యవహరిస్తారు.
సీఎం మమతకు ఆహ్వానం పంపరా? తృణమూల్ ఫైర్
అసలే బెంగాల్ లో ఎన్నికల మేఘాలు కమ్ముకున్నాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు ఎప్పుడు, ఏ విషయాన్ని రాజకీయం చేసి, దుమ్మెత్తిపోయాలా? అని ఎదురుచూస్తుంటాయి. అయితే విశ్వభారతి యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలనూ రాజకీయం చేసేశారు. ఇంతటి ఘనమైన శతాబ్ది ఉత్సవాలకు సీఎం మమతను యూనివర్శిటీ అధికారులు ఆహ్వానించలేదని తృణమూల్ తీవ్రంగా ఆక్షేపించింది. ఆహ్వానం పంపకుండా సీఎం మమతను బీజేపీ అవమానించిందని తృణమూల్ మండిపడింది. అయితే తాము అధికారికంగా సీఎం మమతకు ఆహ్వానం పంపామని యూనివర్శిటీ అధికారులు పేర్కొంటున్నారు. 20 రోజుల ముందే ఆహ్వానం పంపామని యూనివర్శిటీ టీం స్పష్టం చేసింది. అయితే సీఎం మమత ట్విట్టర్ వేదికగా శతాబ్ది ఉత్సవాలపై స్పందించారు. ‘‘విశ్వభారతి యూనివర్శిటీని స్థాపించి వందేళ్లు గడిచాయి. ఓ ఆదర్శవంతమైన మానవుణ్ని తీర్చిదిద్దడానికి విశ్వకవి రవీంద్రుడు దీనిని ప్రయోగశాలగా ఎంచుకున్నారు. అంతటి దార్శనికుడి దార్శనికతను, సిద్ధాంతాన్ని మనం కాపాడుకోవాలి.’’ అని మమత బెనర్జీ ట్వీట్ చేశారు.













