త్రివర్ణ పతానికి జరిగిన అవమానం అందర్నీ బాధించింది
ఎర్రకోటలో త్రివర్ణ పతానికి జరిగిన అవమానం దేశ ప్రజలందర్నీ ఎంతో బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం మొదటి సారి ‘మన్ కీ బాత్’ లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వ్యాక్సిన్ డ్రైవ్‌లో భారత్ చాలా ముందుందని, ఇప్పటి వరకూ మూడు మిలియన్ల మందికి టీకాలు వేసిన దేశమని ప్రకటించారు. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన కోవిడ్ టీకా ఆత్మనిర్భర భారత్‌కు ఓ ప్రతీకగా అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కడా జరగనంత వేగంగా టీకా కార్యక్రమం నడుస్తోందని, ఇప్పటి వరకూ 30 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. అమెరికాలో ఇదే సంఖ్యను 18 రోజుల్లో చేరుకున్నారని, ఇక బ్రిటన్‌లో 36 రోజులు పట్టిందని, అదే భారత్‌లో మాత్రం కేవలం 15 రోజులు మాత్రమే పట్టిందని ఆయన పేర్కొన్నారు. వివిధ పండగలు, ఉత్సవాలు, గణంతంత్ర వేడుకలు… వీటితో జనవరి మాసం అత్యంత వేగంగా గడిచిపోయిందని గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్‌ను ప్రస్తావించిన ప్రధాని
మన్ కీ బాత్ లో భాగంగా ఆయన హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్‌ను ప్రస్తావించారు. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న తీరును మోదీ ప్రశంసించారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానం చాలా సంతృప్తినిచ్చిందని మోదీ పేర్కొన్నారు.
వ్యవసాయ ఆధునికీకరణకు కట్టుడి ఉన్నాం …
వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ ఆధునికీకరణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. మన్ కీ బాత్ సందర్భంగా యూపీలో జరుగుతున్న ‘స్ట్రాబెరీ ఉత్సవాలు‘ గురించి ప్రస్తావించారు. పెరట్లో కానీ, పై కప్పుపై కానీ స్ట్రాబెరీలను పెంచే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాయని ప్రశంసించారు.
సమర యోధులకు సంబంధించి రచనలు చేయండి…
75 వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోబోతున్న నేపథ్యంలో సమర యోధులకు సంబంధించిన వీరగాధలు రాయాలని యువ రచయితలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్ల వారికి నివాళి ఇచ్చిన వారమవుతామని పేర్కొన్నారు. యువ రచయితలు ఇందుకు చొరవ తీసుకోవాలని, ఇలా చేయడం ద్వారా యువ రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.













