కెమెరాల ముందే మహిళా ఎమ్మెల్యేతో సీనియర్ నేత అసభ్య ప్రవర్తన!
రాజకీయాల్లో మహిళలకు ఎంతటి ఉన్నత పదవులు దక్కినా, కొన్నిసార్లు అసభ్యకర పోకడలు వారిని వెంటాడుతూనే ఉంటాయి అనడానికి కేరళలో జరిగిన తాజా ఘటనే ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రధాన కార్యాలయంలో అందరూ చూస్తుండగానే ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల ఆ పార్టీకే చెందిన 71 ఏళ్ల సీనియర్ నాయకుడు వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, సమ్మతిని రాజకీయ నాయకులు ఎంత చులకనగా చూస్తారో ఈ ఘటన కళ్లకు కట్టింది.
అసలేం జరిగిందంటే..
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రధాన కార్యాలయంలో లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగుతున్న సమయం అది. కొల్లాం నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు. మీడియా ప్రతినిధులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ లోపలికి వెళ్తున్న ఆమెకు.. కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ ఎదురుపడి స్వాగతం పలికారు. అయితే అక్కడే ఆయన హద్దులు మీరారు. ఆమెను బలవంతంగా హగ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. బిందు కృష్ణ చాలా స్పష్టంగా ఆయనకు కేవలం ‘హ్యాండ్ షేక్’ మాత్రమే ఇచ్చి దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. ఆమె ముఖంలో అసౌకర్యం, ఇబ్బంది కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా, వయసులో పెద్దవాడైన ఆ నేత ఏమాత్రం సంకోచించకుండా ఆమె మెడపై చేయి వేసి తనవైపు లాక్కునే యత్నం చేశారు.
వద్దంటున్నా రెండోసారీ..
ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న బిందు కృష్ణ.. వెంటనే ఆయన్ని సున్నితంగా పక్కకు నెట్టేసి, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి అక్కడినుంచి ముందుకు కదిలారు. అయినా సరే ఫిలిప్ వదల్లేదు. వెనక నుంచి వెళ్లి రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఇంత జరుగుతున్నా, అక్కడ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు, కొందరు జర్నలిస్టులు ఆ నేతను వారించాల్సింది పోయి.. సిగ్గులేకుండా నవ్వుతూ నిలబడటం సమాజం తలదించుకునేలా చేసింది.
హద్దుమీరితే సీనియారిటీ ఏంటి?
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. “ఒక చట్టసభకు ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే, ఇక పార్టీలో (Congress) సామాన్య మహిళా కార్యకర్తల పరిస్థితి ఏంటి?” అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన, మహిళల పర్సనల్ బౌండరీస్ ఉల్లంఘించే హక్కు ఎవరిచ్చారని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఇంతటి వివాదం చెలరేగుతున్నా అటు చెరియన్ ఫిలిప్ గానీ, బాధితురాలు బిందు కృష్ణ గానీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. మహిళా సాధికారత గురించి వేదికల మీద గొంతెత్తే కాంగ్రెస్ (Congress) అధిష్టానం.. కెమెరాల సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధిని వేధించిన ఆ సీనియర్ నేతపై తక్షణమే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.








