జయహో భారత్ ..చంద్రయాన్–3 సక్సెస్..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం కనిపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యింది. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. జాబిల్లిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు కాస్త టెన్షన్ పడ్డారు. ల్యాండింగ్ మాడ్యూల్ ను తనిఖీ చేశారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగడానికి సూర్యోదయం కోసం వెయిట్ చేశారు. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
బుధవారం సాయంత్రం ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇక.. సరైన ఎత్తులో, సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని ల్యాండర్ తన ఇంజిన్ లను మండించుకోవాలి. ల్యాండర్ మాడ్యూల్లో పారామీటర్లన్నింటినీ తనిఖీ చేసి ఎక్కడ సాఫ్ట్ ల్యాండ్ కావాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ నుండి ఇస్రో సంబంధిత కమాండర్ లను ల్యాండర్ మాడ్యూల్ కు అప్ లోడ్ చేసింది. ల్యాండింగ్ షెడ్యూల్ కు రెండు గంటల ముందు ఇది చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ జోహెన్నస్‌బర్గ్ నుంచి వర్చువల్ గా వీక్షించారు.
విక్రమ్ ల్యాడర్ దిగిన వెంటనే అందులోంచి రోవర్ ప్రజ్జాన్ బయటకు వచ్చి జాబిలిపై భారత దేశం తరుపున తొలి అడుగులు వేసింది.. చంద్రుడి నిర్మాణం, అక్కడి వాతావరణం, పరిమాణంపై చంద్రయాన్-3 పరిశోధించనుంది.













