Bab al Mandeb: ప్రపంచానికి ‘విషాద ద్వారం’ ముప్పు.. బాబ్ అల్ మాండెబ్పై ఇరాన్ కన్నెర్ర!
Bab al Mandeb: హర్మూజ్ జలసంధి వద్ద ఇప్పటికే నౌకాయానాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఇరాన్, ఇప్పుడు మరో కీలక జలమార్గంపై హెచ్చరికలు జారీ చేసింది. తమ అధీనంలోని ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తే, వ్యూహాత్మకమైన బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి పెను సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
ఏమిటీ ‘విషాద ద్వారం’?
అరబిక్ భాషలో బాబ్ అల్ మాండెబ్ అంటే ‘కన్నీటి ద్వారం’ లేదా ‘విషాద ద్వారం’ అని అర్థం. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ జలసంధి, సూయజ్ కాలువ మీదుగా వెళ్లే నౌకలకు ప్రధాన మార్గం. కేవలం 30 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ మార్గం గుండా ప్రతిరోజూ 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది.
హూతీల ముప్పు – అంతర్జాతీయ వాణిజ్యంపై దెబ్బ:
ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఇప్పటికే ఈ మార్గంలో తిష్ట వేశారు. యెమెన్ తీర ప్రాంతం నుంచి డ్రోన్లు, క్షిపణులతో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లోనే 134 నౌకలపై దాడులు జరగడంతో, ఎర్ర సముద్రం గుండా సాగే వర్తకం 60 శాతానికి పైగా తగ్గిపోయింది. ఫలితంగా నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది, ఇది రవాణా ఖర్చులను , సమయాన్ని విపరీతంగా పెంచుతోంది.
అమెరికా ప్రతిఘటన సిద్ధం:
ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధిస్తే అమెరికా గట్టిగా స్పందించే అవకాశం ఉంది. ఈ జలసంధికి ఆవలి వైపున ఉన్న జిబౌటిలో అమెరికాకు భారీ సైనిక స్థావరం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఈ నౌకామార్గాన్ని కాపాడుకోవడానికి అగ్రరాజ్యం సైనిక చర్యకు దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు చిలికి చిలికి గాలివానలా మారి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అస్థిరతకు దారితీస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.








