పుతిన్ తో భేటీ వాయిదా : అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తదుపరి సమావేశాన్ని వచ్చే ఏడాది వరకు వాయిదా వేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తే ఈ వాయిదాకు కారణంగా పేర్కొంది. రష్యా ప్రేమయంపై దర్యాప్తు ముగిసిన తర్వాతనే తదుపరి ద్వైపాక్షిక సమావేశం జరగాలని అద్యక్షుడు భావిస్తున్నారని, దానికి తాము కూడా అంగీకరించామని జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. శీతాకాలంలో వ్లాదిమిర్ పుతిన్‌ను వాషింగ్టన్ రావాల్సిందిగా ఆహ్వానం పంపాలని ట్రంప్, బోల్టన్‌ను కోరారని, అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయంటూ గత వారం వైట్‌హౌస్ తెలిపింది. అయితే అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల సందర్భంగా పుతిన్, ట్రంప్ కలుసుకోవచ్చునని రష్యా అధ్యక్ష భవనం తెలిపింది. వాషింగ్టన్లో ప్రతిపాదిత సమావేశం గురించి ఎలాంటి సన్నాహాలు జరగడం లేదని సృష్టం చేసింది. హెల్సింకిలో పుతిన్‌తో భేటీ అయిన నేపథ్యంలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రష్యాతో మెతక వైఖరి అవలంభిస్తున్నారని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.













