జి జిన్‌పింగ్ వ్యాఖ్యలను స్వాగతించిన అమెరికా
బయటి దేశాల సరకులకు తమ దేశం మార్కెట్ తలుపులు మరింత తెరుస్తామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలను అమెరికా స్వాగతించింది. అయితే దీనికి సంబంధించి చైనా నుంచి సృష్టమైన చర్యలు అవసరమని అంటూ, చైనా ఉత్పత్తులపై 5 వేల కోట్ల డాలర్ల విలువైన 25 శాతం దిగుమతి సుంకాలను విధించాలన్న ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోబోమని సృష్టం చేసింది. బోవో ఫోరమ్ ఫర్ ఆసియాలో జి జిన్‌పింగ్ ప్రసంగిస్తూ, ఆటో దిగుమతులపై టారిఫ్‌లను తగ్గిసామని, విదేశీ కంపెనీల మేధోసంపత్తి హక్కులను కాపాడుతామని, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్వవస్థ అయిన చైనా తలుపులను మరింత తెరుస్తామని హామీ ఇచ్చారు. తెరుచుకుంటున్న చైనా తలుపులు మూతపడవని, వాస్తవానికి అవి మరింత తెరుచుకుంటాయని జీ అన్నారు.
జిన్‌పింగ్ మాటలు తమకెంతో సంతోషం కలిగించాయని, అయితే అదే సమయంలో చైనా వైపునుంచి మరింత పటిష్టమైన చర్యలను కోరుకుంటున్నామని, అది జరిగేంతవరకు తాము అనుకునే విధంగానే ముందుకు సాగుతామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మీడియాకు తెలిపారు. జీ జీన్‌పింగ్ వ్యాఖ్యలను అధ్యక్షుడు స్వాగతించిన తర్వాత వైట్‌హౌస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.













