పాక్ కు భారత్ కౌంటర్
మానవ హక్కుల గురించి తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని పాకిస్థాన్‌కు గట్టిగా బదులిచ్చింది భారత్. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఈ సందర్భం చోటుచేసుకున్నది. పాకిస్థాన్ ఓ విఫల రాష్ట్రమని, ఆ దేశం మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదని భారత్ తెలిపింది. ఆ సమావేశంలో భారత ప్రతినిధి మినీ దేవి కుమమ్ మాట్లాడారు. యుఎస్ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తింది. దీంతో దానికి కౌంటర్‌గా భారత్ మాట్లాడింది. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఉమర్ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ముందుగా ఉగ్రమూకలను తరిమేయాలని ఈ సందర్భంగా భారత్ డిమాండ్ చేసింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారని, అలాంటి దేశం భారత్‌లో మానవ హక్కుల గురించి మాట్లాడడం శోచనీయమని మినీదేవి తెలిపారు. 2008లో ముంబై పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులకు శిక్షపడేలా పాక్ చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. విఫల రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఓ దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి పాఠాలు వినాల్సిన అవసరం లేదన్నారు.













