ఆ దేశం పై ఆంక్షలు : అమెరికా
కరోనా వైరస్ మహమ్మారిగా మారడానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించి చైనా పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోయినా, దర్యాప్తునకు సహకరించకపోయినా ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు చైనాపై ఆంక్షలు విధించేలా అధ్యక్షుడు ట్రంప్‌నకు అధికారమిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును తొమ్మిది మంది సెనేటర్లు కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ది కొవిడ్ 19 అకౌంటబిలిటీ యాక్ట్ పేరిట సెనేటర్ లిండ్సే గ్రాహం రూపొందించిన బిల్లుకు మరో ఎనిమిది మంది సెనేటర్లు మద్దతిచ్చారు. అందరూ కలిసి కాంగ్రెస్ ఎగువ సభ అయిన సెనేట్‌లో దానిని ప్రవేశపెట్టారు. అమెరికా, దాని మిత్రపక్షాలు లేదా ఐరాస అనుంబంధ సంస్థలు చేపట్టే దర్యాప్తునకు అవసరమైన సమచారం చైనా ఇచ్చిందా? లేదా? అన్న విషయాన్ని అధ్యక్షుడు 60 రోజుల్లోగా కాంగ్రెస్‌కు తెలియజేయాలని అందులో ప్రస్తావించారు. చైనాలోని జంతు మాంస విక్రయ మార్కెట్లను మూసివేయాలని సెనేటర్లు డిమాండ్ చేశారు.






