H-1B Visa: నైపుణ్యాలు, వేతనం ఆధారంగా హెచ్-1బీ.. నూతన లాటరీ విధానం..
వృత్తినిపుణులకు ఇచ్చే హెచ్-1బీ వీసాల జారీప్రక్రియకు సంబంధించి అమెరికా నూతన నిబంధనలు వెల్లడించింది. వీసా కేటాయింపుల విధి విధానాలను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్.. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. ఈ కొత్త పద్ధతి (H-1B Visa Lottery System) వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. 2027 ఆర్థిక సంవత్సరం హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు ఇది వర్తించనుంది.
ఈ కొత్త విధానంలో ఇప్పుడు ఉన్నట్లుగా ర్యాండమ్‌గా హెచ్-1బీ వీసాలు (H-1B Visa) జారీ చేయరు. అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు వీసా పొందే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇక, తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
లాటరీ విధానంలో వచ్చే మార్పులు..
ఈ కొత్త పద్ధతి కోసం హెచ్-1బీ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను అమెరికా (USA) కార్మిక శాఖ క్రమబద్ధీకరించింది. నాలుగంచెల వేతన వ్యవస్థగా విభజించింది. ఎంట్రీ లెవల్ వర్కర్లను లెవల్-1గా.. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను లెవల్-4గా పరిగణించింది. ఇందులో ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు ఇప్పటిలాగే ర్యాండమ్ విధానంలో లాటరీ తీయనున్నారు. మిగతా వారికి మాత్రం వారి వేతన స్థాయి ఆధారంగా లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.
అత్యధిక వేతనం కలిగిన లెవల్-4 ఉద్యోగులకు నాలుగు సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలు ఉంటుంది. అంటే.. వారు వీసాలకు ఎంపికయ్యే అవకాశం 61 శాతం ఉంటుంది. లెవల్-3 ఉద్యోగులు మూడుసార్లు లాటరీలోకి వెళ్లొచ్చు. దీంతో వీరికి వీసాలు పొందే అవకాశం 46 శాతం లభిస్తుంది.లెవల్-2 ఉద్యోగులు రెండు సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలు ఉంటుంది. వీసాలు లభించే ఛాన్స్ 31 శాతంగా ఉండనుంది.
ఇక, లెవల్-1 ఉద్యోగులు ఒకేసారి లాటరీలో ఉంటారు. దీంతో గతంతో పోలిస్తే ఇప్పుడు వీరికి వీసా లభించే ఛాన్స్ 15 శాతం తగ్గనుంది.
భారతీయులకు ఎంబసీ అలర్ట్..
అమెరికా అనుసరిస్తోన్న కఠిన విధానాలతో వలసదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్, ఇతరత్రా నిబంధనలతో ఇప్పటికే హెచ్-1బీ, హెచ్-4 వీసా అపాయింట్మెంట్లు ఆలస్యమవుతుండటంతో భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిణామాల వేళ భారత్‌లోని అమెరికా ఎంబసీ కీలక సూచనలు చేసింది. అగ్రరాజ్య చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అక్రమ వలసలు అడ్డుకోవడానికి, తమ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికి ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.






