పాఠశాలకు షెడ్ ను కట్టిచ్చిన ‘తానా’
అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం కె. నర్సాపురం జడ్పి హైస్కూల్ విద్యార్థులు బోధనకే గదులు సరిపోకపోవడంతో మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి సరైన వసతి లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాఠశాల బయట ఎండలోనే వారు భోజనం చేస్తున్న దుస్థితిని తెలుసుకున్న తానా సభ్యుడు రవి పోతూరు ఈ విషయాన్ని తానా కోశాధికారి రవి పొట్లూరికి తెలియజేశారు. దీంతో రవి పొట్లూరి తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన దృష్టికి తీసుకురాగా, ఆయన ఇందుకు అవసరమైన షెడ్‌ను నిర్మించాల్సిందిగా సూచించారు. రవి పొట్లూరి, రవి నాయుడు, వెంకట్ ఎస్. కనుమూరి, కృష్ణమోహన్ టంగుటూరితో కలిసి షెడ్ నిర్మాణానికి అవసరమైన 2 లక్షల రూపాయలను పాఠశాలకు విరాళంగా ఇచ్చి షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ షెడ్‌ను రవి పొట్లూరి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, తానా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఇటీవలే ముగిసిన చైతన్యస్రవంతి కార్యక్రమంలో రైతు రక్షణకోసం అవసరమైన పరికరాలను రైతులకు అందజేసినట్లు చెప్పారు. విద్యార్థుల చదువుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థినీ విద్యార్థులు, ముప్పారాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.













