అమెరికా బయోటెక్ కంపెనీ మోడెర్నాతో స్విస్ ఒప్పందం
కొవిడ్ 19పై మోడెర్నా రూపొందించిన వ్యాక్సిన్ 45 లక్షల డోసుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని స్విట్జర్లాండ్ తెలిపింది. అమెరికా బయోటెక్ కంపెనీ మోడెర్నాతో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం. తమ దేశ ప్రజలకు సత్వరమే వ్యాక్సిన్ ఇవ్వాలన్న సంకల్పంతోనే ఈ ఒప్పందం జరిగినట్లు స్విస్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా 22 లక్షల 50 వేల మంది స్విస్ పౌరులకు వ్యాక్సిన్ లభిస్తుంది. మోడెర్నా తయారు చేసే వ్యాక్సిన్ రెండు డోసులుగా ఇవాల్సి ఉంటుంది. ఇతర కంపెనీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునే యోచనలో స్విస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద వాక్సిన్ల కోసం 33 కోట్ల డాలర్లను స్విస్ ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత డీల్‌కు సంబంధించిన ఆర్థిక విషయాల్ని మాత్రం వెల్లడించలేదు.













