SiliconAndhra: సిలికానాంధ్ర వైభవాన్ని మరింతగా విస్తృతం చేస్తాం

తెలుగుటైమ్స్‌తో అధ్యక్షురాలు సత్యప్రియ తనుగుల
అమెరికాలో మన సంస్కృతిని, సంప్రదాయా లను ప్రతిబింబించే ఎన్నో కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న సిలికానాంధ్ర (SiliconAndhra) సంస్థ మరో సంచలనం సృష్టించింది. సిలికానాంధ్ర 2025` 2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని మహిళలతోనే ప్రకటించి సంచలనం సృష్టించింది. తొలిసారిగా మొత్తం మహిళలతో కూడిన నాయకత్వ బృందం ఏర్పడటంపై ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షురాలిగా సత్యప్రియా తనుగుల, ఉపాధ్యక్షురాలిగా శిరీష కలేరు, కోశాధికారిగా మాధవి కడియాల, కార్యదర్శిగా రామ సరిపల్లె, సంయుక్త కార్యదర్శిగా ఉష మాడభూషిలు బాధ్యతలు స్వీకరించారు. వీరందరూ అనేక సంవత్సరాలుగా సంస్థకు సేవలందిస్తూ సాంస్కృతిక మహోత్సవాలు, అంతర్జాతీయ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, గ్లోబల్ అవుట్రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. వారి కృషి, దృష్టి, నాయకత్వం సమాజంపై సిలికానాంధ్ర ప్రభావాన్ని వ్యాప్తిచేయగా, ఇప్పుడు సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నారు.
సిలికానాంధ్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సత్యప్రియ తనుగులతో తెలుగుటైమ్స్‌తో మాట్లాడినప్పుడు పలు విషయాలను ఆమె వెల్లడించారు.
సిలికానాంధ్రతో అనుబంధం గురించి 25 సంవత్సరాలుగా నేనూ, మా వారు సిలికానాంధ్ర అభిమానులం. నా భర్త సందీప్ తెనుగుల 2015-17 కార్యవర్గంలో ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సిలికానాంధ్ర కార్యవర్గంలో పనిచేశారు. 2000 డిసెంబర్‌లో సిలికానాంధ్ర ప్రారంభం జరిగింది. 2001 జనవరిలో మాకు బాబు పుట్టారు. అందుకే సిలికానాంధ్ర పుట్ట్టుక మా ఫ్యామిలీలో అబ్బాయి పుట్టుక ఒకేసారి జరిగాయి. రెండు నాకు కుటుంబాలే. నేను ఎల్లప్పుడు సిలికానాంధ్ర సైనికురాలినే. 2004లో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్లతో పరిచయం ఏర్పడిరది. అప్పుడే గుమ్మడి గోపాల కృష్ణ గారితో శ్రీ కృష్ణ రాయబారం నాటకంలో నాకు ద్రౌపదీగా వేషం వేయించి సిలికానాంధ్ర అభిమానులకు పరిచయం చేశారు. ఆ తరువాత కూడా వీలునుబట్టి నేను నాటకాలలో వేషాలు వేస్తున్నాను. కన్యాశుల్కంలో మధుర వాణి పాత్ర, శ్రీనాధకవి నాటకంలో పాత్రలను కూడా వేశాను. ఆ తరువాత సాంఘిక నాటకం సాక్షిలో కూడా వేసి అందరి వ్రశంసలు పొందాను. సిలికానాంధ్ర వారి సంపద విభాగంలో కూడా చాలా చురుకుగా ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను.
చేయబోయే కార్యక్రమాల గురించి
మా కార్యవర్గం తరపున వివిధ కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నాము. మొదటి నుంచి సిలికానాంధ్ర జేజేమ్మగా పేరు తెచ్చుకొన్న శాంతి కూచిభొట్ల చాలా సలహాలు, సూచనలతో హెల్ఫ్ చేస్తున్నారు. అలాగే జయంతి కొట్ని కూడా సలహాలను సూచనలను అందిస్తున్నారు. సిలికానాంధ్ర సాహితి, సంస్కృతి, సాంప్రదాయం అనే మూడు నినాదాలతో వెళుతోంది. ఇప్పటికే సంస్కృతి, సంప్రదాయం విషయంలో మంచి పేరు తెచ్చుకొంది. సాహిత్య రంగంలో కూడా మా టీమ్ ద్వారా ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నాము. సాహిత్యపరంగా నవలల పోటీలు పెడదామని, సాహిత్యపరమైన కార్యక్రమాలు చేద్దామని ఆలోచిస్తున్నాము.
మా కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచనున్నాము. మాకు సిలికానాంధ్ర ఆడపడుచులు పేరుతో వాట్సాప్ గ్రూపు ఉంది. ఇది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న మహిళలందరిని కూడా సిలికానాంధ్ర వారి అన్ని కార్యక్రమాలలో వారు పాల్గొనే విధంగా వారిని ఉత్తేజపరిచి, ఉత్సాహపరుస్తూ ఉంటాము. మహిళల పటిమను, ప్రతిభను వెలికితీసేలా కార్యక్రమాలు చేయాలని కూడా అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ పుట్టి పెరిగిన మన తెలుగు పిల్లలు ఇప్పుడు టీనేజ్ లోనూ యూత్ ఏజ్‌లోనూ ఉన్నారు. వారందరికి కూడా సిలికానాంధ్ర విధానాలను చూపిస్తూ వారిని ఆకర్షించాలని యూత్ భాగస్వామ్యాన్ని పెంచాలని అనుకొంటున్నాను. వచ్చే సంవత్సరానికి సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవం వస్తుంది. అంతటి గొప్ప వేడుకలకు మేము కార్యవర్గ నాయకులుగా ఉండడం మా అదృష్టం. ఈ వేడుకను చాలా వైభవంగా, పెద్దగా చేయాలని మా ఉద్దేశం.
సిలికానాంధ్ర కార్యక్రమాలకు మీడియాపరంగా సేవలందిస్తున్న తెలుగు టైమ్స్‌కు, పాఠకులకు మా నమస్కారాలు, అభినందనలు.