యూఎస్ ఓపెన్‌కు జబర్ దూరం
టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ నుంచి 2022 రన్నరప్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) వైదొలగింది. భుజం గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న బజర్ వివరించింది. 2022లో కెరీర్ బెస్ట్ ప్రపంచ రెండో ర్యాంకర్‌గా నిలిచిన జబర్ ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. వరుసగా రెండేళ్లు ( 2022, 2023) వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్‌గా నిలిచిన జబర్ ఈ సీజన్లో మొత్తం 15 టోర్నీలు ఆడిరది. అయితే ఆమె ఒక్క టోర్నీలోనూ సెమీఫైనల్ చేరలేకపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిన జబర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో, వింబుల్డన్ టోర్నీలో మూడో రౌండ్లో నిష్క్రమించింది. ఈ నెల 26న న్యూయార్క్‌లో మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ (అమెరికా) డిఫెండిరగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నాయి.







