ఆమె జి-7కు హాజరుకావడం లేదు
ఈ వారంలో క్యూబెక్‌లో జరిగే జి-7 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా మొదటి మహిళ, డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ హాజరు కావడం లేదని వైట్‌హౌస్ పేర్కొంది. అలాగే జూన్ 12న సింగపూర్‌లో ఉత్తరకొరియాతో నిర్వహించే సమావేశానికి హాజరయ్యేందుకు కూడా ప్రణాళిక సిద్ధం కాలేదని తెలిపింది. కాగా, మెలానియా గతేడాది ఇటలీలో జరిగిన జి-7సమ్మిట్‌కు హాజరయ్యారు. గత నెల 10 నుండి ఆమె పెద్దగా కనిపించడం లేదు. ఆమె మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో అస్వస్థకు గురవ్వగా, గత నెల 14న శస్త్రచికిత్స చేసి 19న డిశ్చార్జి చేశారు. ఈ పరిస్థితుల్లో ఆమె జి-7కు హాజరుకావడం లేదని, ఈ సమయంలో సింగపూర్ ప్రయాణికి వెళ్లేందుకు ప్రణాళికలేమి సిద్ధంగా లేవని మెలానియా అధికార ప్రతినిధి స్టిపనీ గ్రిసం పేర్కొన్నారు.
విధి నిర్వహణలో మరణించిన సభ్యుల కుటుంబాలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి అధ్యక్షుడు, మెలానియా హాజరుకానున్నారని వైట్‌హౌస్ పేర్కొంది. కాగా, గత కొన్ని రోజులుగా ఆమె ప్రజలకు కనిపించకపోవడంతో వచ్చిన వదంతుల నేపథ్యంలో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. నేను ఎక్కడున్నాను. ఏమి చేస్తున్నానన్న విషయాలపై మీడియా ఎక్కువగా దృష్టి సారించింది. నేను హైట్‌హౌస్‌లో కుటుంబ సభ్యులతోనే ఉన్నాను. ఇక్కడి నుండే అమెరికా ప్రజలకోసం, తన పిల్లల కోసం కష్టపడుతున్నానని ట్వీట్ చేశారు.













