డాలస్ లో ఘనంగా 148వ గాంధీ జయంతి సంబరాలు
మహాత్మా గాంధీ 148వ జయంతిని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అక్టోబర్ 1న మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్ (డాలస్) నగరంలో, ఐ.ఏ.ఎన్.టి ఆధ్వర్యంలో “గాంధీ పీస్ వాక్” ను వందలాది మంది ప్రజల మధ్యలో ఘనంగా నిర్వహించారు. శాంతికి నిదర్శనంగా ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరూ తెల్లని టోపీలు, తెల్లని దుస్తులు ధరించడం చూడముచ్చటగా ఉంది.
ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర్ మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్, హుస్టన్ నగరం నుంచి కాన్సుల్ ఆఫ్ ఇండియా ఆర్. డి. జోషి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎం.జి.ఎం.ఎన్.టి డైరెక్టర్లలో ఒకరైన శ్రీమతి షబ్నమ్ మోద్గిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి హాజరైన వారందరికీ అక్టోబర్ 2 తారీఖును యునైటెడ్ నేషన్స్ “అహింసా అంతర్జాతీయ దినోత్సవం”గా ప్రకటించారని గుర్తుచేశారు. రావు కల్వల, ఎం.జి.ఎం.ఎన్.టి సెక్రటరీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఇర్వింగ్ సిటీ, కమ్యూనిటీ, అమెరికాలోనే అతి పెద్ద గాంధీ మెమోరియల్ ను స్థాపించడానికి కలిసి పని చేసినందుకు చాలా సంతోషకరంగా ఉందని, ఇందుకోసం పాటుబడిన వారందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.
జాన్ హామండ్, ఎం.జి.ఎం.ఎన్.టి కోచైర్ నిరంతరం కృషి చేస్తున్న ఎం.జి.ఎం.ఎన్.టి బోర్డు సభ్యులను అందరికి పరిచయం చేశారు. సల్మాన్ ఫర్షోరి, ఐ.ఏఎన్.టి అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గాంధీ పీస్ వాక్ ను గాంధీ గారి స్మారక విగ్రహం వద్ద నిర్వహించడం ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపారు. ఇర్వింగ్ నగర్ మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్ ఈ కార్యక్రమానికి తాను ప్రత్యేక అతిధిగా వచ్చి, గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వకారణం గా ఉందని, చాలా సంవత్సరాలుగా సిటీ గవర్నమెంట్ తో కలిసి పని చేస్తూ, ఇలాంటి కమ్యూనిటీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ఎం.జి.ఎం.ఎన్.టి బోర్డు సభ్యులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలన్నింటికి తమ పూర్తి మద్దతు, సహాయం ఎల్లపుడు ఉంటుందని తెలిపారు.
ఎం.జి.ఎం.ఎన్.టి చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని కలిగి ఉండటం చాలా ముఖ్యమని, గాంధీ గారు ఏ ఆయుధాలను ఉపయోగించకుండా భారత స్వాతంత్రం కోసం పోరాడారని, ఆయన నిరాడంబరత, నిజాయితీ మరియు సమగ్రత ఇందుకు ఉదాహరణం అని తెలిపారు. అందుకే గాంధీజీని ప్రపంచ శాంతి చిహ్నంగా గుర్తిస్తారని అన్నారు. శాంతి ఒక చిరునవ్వుతో మొదలవుతుందని, అది ఒక గదికి వెలుగును ప్రసాదిస్తుందని మరియు ప్రపంచమంతా చిరునవ్వుతో నిండిఉంటే అది ఏమి చేయగలదో ఊహించుకోవచ్చని డాక్టర్. తోటకూర అన్నారు. మనమంతా ఒకరికి ఒకరు మానవతా దృక్పధంతో సహాయం చేస్తూ ఉంటే, శాంతి నెలకొంటుందని ప్రసాద్ గారు తెలిపారు.
ఎం.జి.ఎం. ఎన్ .టి బోర్డు సభ్యులు, అతిధులు శాంతికి గుర్తుగా తెల్లటి పావురాలను ఎగరవేశారు.తరువాత హాజరైన వారందరూ గాంధీ పీస్ వాక్ లో పాల్గొని, అనంతరం గాంధీ గారి విగ్రహానికి పుష్పగుచ్ఛాలను ఉంచి తమ నివాళులు అర్పించారు. ఐ.ఏ ఎన్.టి సెక్రటరీ బి. ఎన్ తమ టీం సభ్యులకు, వాలంటీర్లకు, మీడియాకు, పోలీస్ సిబ్బందికి, ఇర్వింగ్ నగర అధికారులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరెన్నో కార్యకలాపాల వివరాలకు www.mgmnt.org ను సంప్రదించండి.













