న్యూయార్క్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఖమ్మం అమ్మాయి
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కొల్లూరు శ్రీలేఖకు న్యూయార్క్‌లో ఉన్న జాన్సన్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు క్రాస్ చేస్తున్న శ్రీలేఖను వేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో శ్రీలేఖకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తనను జాన్సన్ సిటీలోని విల్సన్ మెమోరియల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శ్రీలేఖ న్యూయార్క్‌లోని బింఘమ్టన్ యూనివర్సిటీలో ఎంస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నది.
కాలిఫోర్నియాలో ఉంటున్న శ్రీలేఖ బంధువు గిరిధర్ వాసిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గత సోమవారం రాత్రి 7:45 గంటల సమయంలో బస్సు దిగిన శ్రీలేఖ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు తనను ఢీకొంది. దీంతో శ్రీలేఖకు తలకు తీవ్రంగా గాయలవ్వడంతో వెంటనే తనను విల్సన్ మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇప్పటికే శ్రీలేఖకు వైద్యులు బ్రెయిన్ సర్జరీని కూడా చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్‌తో వైద్యులు తనకు చికిత్స చేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం శ్రీలేఖ పరిస్థితి విషమంగానే ఉండటంతో పాటు, తన వైద్య ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి.













