San Jose: శాన్‌హోసెలో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

శాన్ హోసెలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో మంచి వార్తను అందించింది. ఇక్కడ ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను (ICAC) అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకలో కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు భారతీయ డయాస్పొరా నాయకులు కూడా ఉన్నారు. ఆగస్టు 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని క్వాత్రా పేర్కొన్నారు. ఇక్కడి ప్రవాస భారతీయులకు కాన్సులేట్ సేవలను ఇంటివద్దకే తీసుకువచ్చామని, ఆ సేవలను మరింత విస్తరించేందుకే ఐసీఏసీని ప్రారంభించామని తెలిపారు. బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, అడిసన్, ఓర్లాండో, రాలీ, శాన్ జోస్.. మొత్తం 8 నగరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల ద్వారా కాన్సులర్ సేవలు మరింతగా
విస్తరిస్తామని తెలిపారు. ఐసీఏసీ ద్వారా కాన్సులర్ సేవలను మరింత వేగంగా అందిస్తామన్నారు. భారతీయ డయాస్పోరాకు కాన్సులేట్ సేవలను సులభతరం చేయబోతున్నామని చెప్పారు.
శాన్ హోసెలో పాస్‌పోర్ట్, వీసా, ఓసీఐ, పవర్ ఆఫ్ అటార్నీ, బర్త్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్స్, అటెస్టేషన్స్, ఎన్‌వోఆర్‌ఐ, పీసీసీ (విదేశీయుల కోసం), లైఫ్ సర్టిఫికెట్(నాన్ పెన్షన్) తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫార్మ్ ఫిల్లింగ్, ఫొటోగ్రాఫ్స్, ఫొటోకాపీ, రిటర్న్ కొరియర్ తదితర సేవలను ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే అందించనున్నారు. ఆగస్టు 1 నుండి అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు సోమవారం నుంచి శనివారం వరకూ తెరిచి ఉంటాయి. అపాయింట్‌మెంట్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు.