మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం
భారత జాతి పిత మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇవ్వాలని కోరుతూ అక్కడి కాంగ్రెస్ చట్ట సభ ప్రతినిధి కరోలిన్ మలోనీ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్ సందర్భంగా ఆమె ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మలోనీ మాట్లాడుతూ గాంధీజీ అహింసాయుతంగా చేసిన చారిత్రక సత్యగ్రహ ఉద్యమం ఓ దేశంతో పాటు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయనకు మరణానంతరం అమెరికా అత్యున్నత పౌర పురస్కారం కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ బిల్లును ప్రవేశపెడుతన్నాను అని అన్నారు.
ఇంటర్నేషనల్ అహింసా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నీతా జైన్‌తో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, ఇతర యుఎస్ టీమ్ ఈ బిల్లు పాసయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఇండియా డే పరేడ్‌కు ఇండియా గ్లోబల్ డైరెక్టర్ ప్రసూన్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీజీ 150వ జయంతి జరుపుకోబోతున్న సందర్భంగా ఆయనకు ఇదో చారిత్రక నివాళి అవుతుందని ప్రసూన్ అన్నారు. ప్రస్తుత ప్రపంచానికి గాంధీ అహింసా, శాంతి మార్గాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.













