డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై నిరసనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై ఐర్లండ్ రాజధాని డబ్లిన్ నగరంలో నిరసనలు పెల్లుబికాయి. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా వేలాది మంది ఐర్లండ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగర ప్రధాన రహదారి ప్రక్కనవున్న కానెల్ స్ట్రీట్‌లో ట్రంప్‌ను హేళన చేసేలా బేబీ ట్రంప్ బొమ్మను ప్రదర్శించారు. వేలాది మంది ప్రదర్శనకారులు ట్రంప్ రాకకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్దపెట్టున నినదించారు. ట్రంప్ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం లాండింగ్ అయిన షానన్ విమానాశ్రయం నుండి అమెరికా సేనలు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శకుల్లో కొందరు బ్యానర్లను ప్రదర్శించారు. విమానాశ్రయం వద్ద వివిధ సామాజిక బృందాలు, రాజకీయ పార్టీలు, ట్రంప్ వ్యతిరేక ప్రచార ఉద్యమ నేతలు చేరి నిరసన తెలియచేశారు. అనంతరం వారు ర్యాలీగా బయల్దేరి డొనాల్డ్ ట్రంప్ గో ఎవే అన్న నినాదాలు చేశారు. ఐర్లండ్‌లో రెండు రోజుల పర్యటన అనంతరం ట్రంప్ అమెరికా తిరిగి వెళ్తారు.













