ఆ విషయంలో మోదీపై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు
ప్రధాని నరేంద్రమోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్‌ను పునర్ నిర్మించేందుకు భారత్ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. అఫ్గాన్‌లో భారత్ నిర్మించిన గ్రంథాలయం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. ట్రంప్ తన కేబినెట్ సహచరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్థాన్ నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. మోడీతో సమావేశమైన సమయంలో అఫ్గాన్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అందుకు మేం కృతజ్ఞతలు తెలిపాం. కానీ భారత్ నిర్మించే గ్రంథాలయంతో కలిగే ప్రయోజనమేంటి? ఎవరు ఉపయోగిస్తున్నారో కూడా తెలియదు అని ట్రంప్ పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్లతో పోరాడేందుకు భారత్ సహా రష్యా, పాకిస్థాన్ వంటి దేశాలు సహకరించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. తాలిబన్లతో శాంతి చర్చలు జరిపేందుకు ఇతర దేశాలు ప్రయత్నించాలని ట్రంప్ కోరారు.













