పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం
వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ఇరు వర్గాలు ధృవీకరించారు. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు తమ దౌత్యవేత్తలను బహిష్కరించిన నేపథ్యంలో ముందుకు సాగడానికి తాము ప్రయత్నిస్తున్నామని రష్యా పేర్కొంటూ ఈ ఆహ్వానం విషయాన్ని వెల్లడించింది. రష్యా విదేశాంగ విధాన సలహాదారు యూరి ఉష్కోవ్ మీడియాతో మాట్లాడుతూ ఇరువురు అధ్యక్షులు టెలిఫోన్లో మాట్లాడుకున్న సందర్భంగా తొలి సమావేశం వాషింగ్టన్లో జరిగితే బాగుంటుందని ట్రంప్ సూచించారని చెప్పారు. అయితే ఇంకా సమావేశపు తేదీలు ఖరారు కాలేదని చెప్పారు.
మార్చి 20న వీరురువురు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ రోజునే త్వరలో పుతిన్‌ను కలుసుకోవచ్చునంటూ ట్రంప్ మీడియాతో అన్నారు. ఆ తర్వాత వారం రోజులకే అమెరికా 60 మంది రష్యన్ దౌత్తవేత్తలను బహిష్కరించింది. ట్రంప్ సూచనను సానుకూలమైన ఆలోచనగా పుతిన్ పేర్కొన్నారని ఉష్కోవ్ తెలిపారు. ఇటువంటి చర్యల వల్ల రెండు దేశాలకే కాకుండా మొత్తంగా అంతర్జాతీయంగా లబ్ది చేకూరుతుందని పుతిన్ వ్యాఖ్యానించారు.













