ఇవాంకకు డొనాల్డ్ ట్రంప్ మద్దతు
అధికార కార్యక్రమాలకు తన కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత ఇమెయిల్ ఉపయోగించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ఇవాంక పంపిన ఇమెయిల్ సందేశాలలో వర్గీకృత సమాచారం లేదని, వాటిని ఇప్పటికే తొలగించలేదని మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. వైట్ హౌజ్ ప్రధాన సలహాదారు అయిన ఇవాంక వైట్ హౌజ్ సహాయకులు, కేబినెట్ సభ్యులు, వ్యక్తిగత సహాయకులకు వందలాది వ్యక్తిగత ఇమెయిళ్లు వాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఫెడరల్ చట్టాలు ఉల్లంఘించిన ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఇవాంక ఉపయోగించిన సమాచారం మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఉపయోగించినటు వంటి వర్గీకరించిన సమచారం కాదని ట్రంప్ పేర్కొన్నారు. హిల్లరీ 33 వేల ఇ మెయిళ్లను తొలగించారని, ఇవాంక తన ఇ మెయిళ్లను తొలగించలేదన్నారు. ఇందులో దాచడానికి ఏమీ లేదని ప్రత్యర్థుల విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇవాంక పంపిన ఇమెయిళ్ల అధ్యక్షుడి రికార్డుల పరధిలోనే ఉన్నట్టు ఆయన సృష్టం చేశారు.













