దీపావళి సంబరాలతో అమెరికా లో వెల్లివిరుస్తున్న భారతీయం
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు అనటం కంటే కూడా అమెరికాలో మునుపు ఎన్నడూ లేనంతగా భారతీయులు తమ ఉనికి చాటుకొనేలా, అమెరికా అంతా గుర్తించేలా ఉంటున్నారు అని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా వైట్ హౌస్ లో దీవాళి వేడుకలు చేయటం, మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా దీవాళీ వేడుకలలో పాల్గొనటం లాంటివి భారతీయులు అమెరికాలో ఎంత బలంగా తమదైన ముద్ర వేసుకున్నారో అన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. భారతీయులు నిర్వహించే మిగతా వేడుకలు కూడా ఇప్పుడు అమెరికన్లను ఆకర్షించడంతోపాటు అందులో పాల్గొనేలా చేస్తున్నాయి. ఎంతోమంది అమెరికన్ రాజకీయ నాయకులు, ప్రముఖులు భారతీయులు నిర్వహించే వేడుకల్లో పాల్గొంటూ వస్తున్నారు. అలాగే తెలుగువాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా అమెరికన్ రాజకీయ నాయకుల హాజరు ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఈసారి జరిగిన దీపావళి వేడుకలు అమెరికా అంతటా కోలాహలంగా జరిగాయి. న్యూయార్క్ మేయర్ అయితే దీపావళి పండుగకు హాలిడే ప్రకటించడం విశేషం. ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్లతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది గవర్నర్లు దీపావళిని పురస్కరించుకుని విందును ఏర్పాటు చేయడం గమనార్హం. ఇలాంటివి చూసినప్పుడు ఇప్పుడు అమెరికాలో భారతీయం వెల్లివిరుస్తోందనడాన్ని కాదనలేము.
వైట్‌హౌజ్‌లో..
అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జోబైడెన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌజ్ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బ్కెడెన్ దంపతులు ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీపావళి రిసెప్షన్’కి 200 మందికి పైగా గెస్టులు హాజరయ్యారు. ఈ సంబరాలలో పూర్తి భారతీయత కనిపించడం విశేషం. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. సితారిస్ట్ రిషబ్ శర్మ, ఎస్ఏ డ్యాన్స్ కంపెనీ ట్రూపు ఆధ్వర్యాన సాగిన ఆర్టిస్టుల డ్యాన్సులు, వారి పర్ఫామెన్స్ కట్టి పడేశాయి. గెస్టుల వస్త్ర ధారణ చూస్తే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించేలా కనిపించిందని చెబుతున్నారు.దీపావళి సందర్భంగా జోబైడెన్ దంపతుల విశిష్ట ఆదరణను మరిచిపోలేమని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేశప్ వ్యాఖ్యానించారు. ఈ ఆతిథ్యాన్ని అందుకోవడం ఓ గొప్ప ప్రివిలేజ్ అని టీవీ ఏసియా సీఈఓ హెచ్.ఆర్. షా పేర్కొన్నారు. అలాగే ఆసియన్ అమెరికన్స్‌పై గల అడ్వయిజరీ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటారియా .. దక్షిణాసియా వాసులను బైడెన్ ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో ఈ ఈవెంట్ నిరూపిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం 130 మందికి పైగా ఇండియన్ అమెరికన్లను ఉన్నత స్థానాల్లో నియమించిందని ఆయన చెప్పారు.
బైడెన్ మాట్లాడుతూ, శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా, దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.
వైస్ ప్రెసిడెంట్ దీపావళి వేడుకలు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరినీ కమలా హ్యారిస్ దంపతులకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్..అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దిపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటి తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి.’’ అని కమలా హ్యారిస్ తెలిపారు. అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం, ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దిపావళి పండుగ..అమెరికాలో ఓ ముఖ్యవేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి.
డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగో లో, (ఫ్లోరిడా రాష్ట్రం) పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు భారతీయ అమెరికన్లతోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, జగదీశ్ ప్రభ లతోపాటు అనేక మంది తెలుగు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ట్రంప్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శలభ్‌కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌబ్రాత్రుత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం మరియు అమెరికా దౌత్య సంబంధాలు, పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని, అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని, శలభ్ కుమార్‌ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంబించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను వేరిపారేస్తామని తెలిపారు. కాగా కార్యక్రమం నిర్వాహకులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే అతిథులను ఈ వేడుకలకు అనుమతించారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు.
టెక్సాస్ గవర్నర్ ఇంట్లో వేడుకలు
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్, సతీమణి సిసిలియా దంపతులు టెక్సాస్త రాష్ట్ర రాజధాని ఆస్టిన్ పట్టణం లో తమ నివాస గృహం లో అక్టోబర్ 23 వ తేదీన వైభవం గా దీపావళి వేడుకలు జరిపారు. ఆ వేడుకలకు టెక్సాస్ రాష్ట్రం నుంచి అనేక మంది భారతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భ గా మాట్లాడుతూ గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్ ‘ దీపావళి పండుగ ముందరి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకురావాలి’’ అని అన్నారు. తానా మాజీ అధ్యక్షులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ ప్రసాద్ తోటకూర గవర్నర్ దంపతులకు అభినందనలు తెలిపారు.
న్యూయార్క్‌లో టైం స్క్వేర్ వద్ద..
న్యూయార్క్ నగరం లోని కొందరు భారతీయ ప్రముఖులు కలిసి అక్టోబర్ 15 వ తేదీ న న్యూయార్క్ నగర బొడ్డున ఉన్న టైం స్క్వేర్ సెంటర్ లో దీపావళి వేడుకలు నిర్వహించారు. న్యూ యార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ముఖ్య అతిధి గా వచ్చి భారతీయ సంతతి ని, భారతీయ సంస్కృతీని, పండుగలను అభినందిం చారు. 2023 నుంచి న్యూయార్క్ నగరంలోని అన్ని పబ్లిక్ స్కూల్స్‌కి దీపావళి పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని ప్రకటించారు. తెలుగు వారిలో ప్రముఖులైన డా. నోరి దత్తాత్రేయులుని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. తెలుగు నాయకులూ రాజేందర్ డిచ్ పల్లి మేయర్ ఎరిక్ ఆడమ్స్ కి అభినందనలు తెలిపారు.













