అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు : ఆంటోనీ ఫౌసి
అమెరికన్లు అందరికీ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరేమీ కాదని, దీనిని తీసుకోవాలని తామేమీ బలవంతం చేయబోమని, కావాలని భావించిన వారు తీసుకోవచ్చని యునైటెడ్ స్టేట్స్ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం చిన్నారులు తదితర కొన్ని గ్రూపులకు మాత్రమే వ్యాక్సిన్ ను తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన సృష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. మేము దాన్ని ఎన్నటికీ రుద్దబోం. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నిర్వహించిన వీడియో టాక్‌లో పాల్గొన్న ఫౌసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్సులో సభ్యుడుగా కూడా ఉన్నారు.
హెల్త్ వర్కర్లు, చిన్నారులు, వృద్ధులు తదితరులకు వ్యాక్సిన్ అందిస్తామని, సాధారణ ప్రజలపై రుద్దబోమని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోకుండా ఆరోగ్య కార్యకర్తలు ఇతరులకు చికిత్స చేయరని, కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారని అన్నారు. కాగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాత్రం ఇందుకు విరుద్దమైన ప్రకటన చేయడం గమనార్హం. ఒకసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎటువంటి పరిమితులూ లేకుండా ప్రతి ఒక్కరికీ దీనిని తీసుకోవడం తప్పనిసరి చేస్తామని సృష్టం చేశారు.













