సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్
కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి సిద్ధమౌతుందని బ్రిటన్ పరిశోధక బృందానికి నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వాక్సినాలజీ ప్రొఫెసర్ సారా గిల్బెర్ట్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని 80 శాతం నమ్మకంతో ఆమె అన్నారు. అయితే నిపుణులు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పడతాయని, కరోనాకు సంబంధించి 12 నుంచి 18 నెలల కాలం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ పరిశోధక బృందం విషయానికి వచ్చేసరికి ఇది కేవలం గొప్పకోసం చెప్పడం కాదని, ప్రతివారం ఈ పరిశోధనలో చాలా డేటా పొందగలుగుతున్నామని గిల్బెర్ట్ వివరించారు. బ్రిటన్ లాక్డౌన్ నాలుగో వారం లోకి వచ్చింది. తిరిగి ప్రజలు మామూలు జీవితంలోకి రావడానికి ఈ వ్యాక్సిన్ ఆధారమౌతుందని ఆమె అన్నారు. ప్రపంచంలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరుకోవడంతో ఆమె ఈ వ్యాక్సిన్ అందుబాటు గురించి చెప్పడం గమనార్హం. మరో రెండు వారాల్లో మానవులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభమౌతాయని చెప్పారు.













