ఆటా కన్వెన్షన్ 2024 – అదరహో అన్నట్టుగా సాగుతున్న ఆటా ఆటల పోటీలు
కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తులు సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహము. ఈ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు మామూలు వాళ్ళు కాదండోయ్, వాటితో పాటు ఆరోగ్యమే మహా భాగ్యమన్న చందాన, అమెరికాలోని పలు నగరాలలో రాబోయే మెగా 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్లో భాగంగా, ఇటీవల అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి మరియు సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. పాల్గొన్న వారికి మరియు ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. కన్వెన్షన్ ఇంకా ఎంతో దూరంలో లేదు, వచ్చే నెల 7 వ తారీఖున మొదలవబోతోంది. అందరూ ఆహ్వానితులే, మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.org ని సందర్శించండి.
ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏ బి సి సెంటర్ లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్ సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్లో పోటీ తీవ్రంగా ఉండటం క్రీడాస్ఫూర్తిని మరింత పెంచింది. షేఖరాగ్ పార్క్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సరే సరి, ఎంతో మంది పాల్గొనడం, మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకుల ఆనందానికి కొదవే లేకుండా పోయింది. పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు దేశవ్యాప్తంగా పాల్గొన్న చదరంగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రోనిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్లలోకి హైలైట్. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీమ్ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్లకు జరిగాయి. ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకచోట చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభ మరియు మధ్య స్థాయిలలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలను కలిగి ఉంది, పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా మరియు జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది.
స్పోర్ట్స్ కమిటీ ఛైర్ అనంత్ చిలుకూరి మరియు ఉమెన్స్ స్పోర్ట్స్ ఛైర్ నీతూ మాట్లాడుతూ, మా ఇటీవలి స్పోర్ట్స్ ఈవెంట్ల విజయంతో మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఆటగాళ్లు ప్రదర్శించిన ప్రతిభ మరియు క్రీడాస్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఈవెంట్లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు మరియు స్పాన్సర్లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, ఇంకా మరిన్ని జరగబోతున్నాయి అని తెలిపారు.
ఇలాంటి పోటీలు ఇంత పెద్ద తరహాలో జరగాలంటే, స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు అనంత్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సికాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి అవుతు, దివ్య నెట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతో మంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది. ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో, భారీ జనసందోహం ముందు జరగబోతున్నది. అలానే, ఆటా వారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనం అందించారు. అందరూ తప్పకుండా రండి, కలిసి మెలిసి మన ఆటా కన్వెన్షన్ ని ఆడుతూ, పాడుతూ జరుపుకుందాం.







