అమెరికాలో కరోనా తీవ్రతతో ఇబ్బందులే… ఆపి అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి
తొలుత కోవిడ్ 19 వైరస్ తీవ్రతను తక్కువ అంచనా వేసిన అమెరికా ప్రభుత్వం తరువాత దాని పరిణామాలు విపరీతంగా ఉండటంతో ప్రస్తుతం ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని నిలువరించడం కష్టంగా మారింది. అమెరికన్లు కూడా ఈ వైరస్‌తో తీవ్రంగా భయాందోళన చెందుతున్నారని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా (ఎఎపిఐ) అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి అన్నారు. ఆపి అనే ఈ సంఘంలో దాదాపు లక్ష మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు. కోవిడ్ వైరస్ నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
అమెరికాలో అతి పెద్ద విపత్తు ఇదే. దీన్ని ఎదుర్కోవడంలో తాము వెనుకబడే ఉన్నామని సురేశ్‌రెడ్డి అంటూ, ఇక్కడి ఈ కరోనా నుంచి రక్షించుకునేందుకు అవసరమైన దుస్తులు, మాస్కుల కొరత ఉందని చెప్పారు. మిగతా నగరాలకన్నా న్యూయార్క్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటూ, అక్కడ అందరికీ పరీక్షలు చేయడం మానేశారని సురేశ్ రెడ్డి చెప్పారు. లక్షణాలున్న వారికి మాత్రమే చేస్తున్నారు. దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చాలా ఆలస్యంగా ప్రారంభించారని అంటూ, ఈ వ్యాధికారణంగా అమెరికాలో లక్ష మంది వరకు మరణించవచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎక్కువమంది వైద్యులు కరోనా బాధితులకు వైద్య సేవలందించడంలో ముందున్నారని సురేశ్ రెడ్డి చెబుతూ, ఒకవైపు భయంగా ఉన్నా, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది దీన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు. భారతీయులు.. తెలుగువారిలో కూడా చాలా మందికి పాజిటివ్ వచ్చింది. అయితే వారికి ప్రాణాపాయం లేదు. మేం హెల్ప్‌లైన్ పెట్టి వైద్య సేవలందిస్తున్నాం. ఇందులో 300 నుంచి 500 మంది డాక్టర్లు పాల్గొంటున్నారు. భారతీయులకు అవసరమైన సహాయం చేస్తున్నాం. ఆరోగ్య బీమా లేని వారికి వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు.
న్యూయార్క్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియా ఇలా అనేక ప్రదేశాల్లో డాక్టర్లు దొరకడం లేదని, రెసిడెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వారిని అసిస్టెంట్ డాక్టర్స్‌గా తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. చైనాలో యువతకు కరోనా సోకలేదు. కాని అమెరికాలో యుక్తవయస్కులకూ వ్యాపించింది. రెండు, మూడు వారాల కిందట వైరస్ సోకిన వారు ఇప్పుడు ఆసుపత్రులకు వస్తున్నారు. మలేరియా కోసం వినియోగించే మందు తీసుకోమని అమెరికా ప్రభుత్వం చెప్పింది. ఇది వాడుతుంటే, రోగి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటోంది. మధుమేహం, రక్తపోటు ఉబ్బసం లేని వాళ్లకు కూడా కరోనా సోకితే తీవ్రమైన సమస్యలు వస్తున్నాయని ప్రస్తుతానికి దీనికి తగిన మందు లేకుండా అనుబంధ వైద్యంతో రోగి ప్రాణాలు కాపాడుతున్నామని సురేశ్ రెడ్డి చెప్పారు.













