పంతం నెగ్గించుకున్న మెలానియా ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నుంచి మహిళా అధికారిని తొలగించే వివాదంలో ట్రంప్ సతీమణి మెలానియానే గెలిచారు. మెలానియా ఒత్తిడితో వైట్‌హౌస్ డిప్యూటీ నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ మీరా రికార్డెల్‌ను ఎట్టకేలకు పదవి నుంచి తొలగించారు. మీరా రికార్డెల్ ట్రంప్ కోసం పనిచేయడానికి అర్హురాలు కాదు అని, అమె ఎక్కువ కాలం శ్వేతసౌధంలో పనిచేయలేరని ఫస్ట్‌లేడీ అధికార ప్రతినిధి వెల్లడించిన మరుసటి రోజే రికార్డెల్‌ను పదవి నుంచి తొలగించి వైట్‌హౌస్ నుంచి పంపేశారు. రికార్డెల్ అధ్యక్షుడికి మద్దతు కొనసాగిస్తారని, యంత్రాంగంలో నూతన బాధ్యతలు తీసుకునేందుకు ఇక్కడి నుంచి వెళ్తున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ వెల్లడించారు. అయితే రికార్డెల్ కొత్త ఉద్యోగం విషయంపై వైట్‌హౌస్ ఎలాంటి సృష్టత ఇవ్వలేదు. రికార్డెల్ గతంలో వాణిజ్య విభాగంలో పనిచేశారు. ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆమెను తన డిప్యూటీగా నియమించుకున్నారు.













